08-05-2025 01:25:03 AM
-కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, మే 7 (విజయక్రాంతి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ మండలంలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎక్లాస్‌పూర్, రాయికల్ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సదస్సులకు కలెక్టర్ హాజరయ్యారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
భూభారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ సదస్సులో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డిఓ మహేశ్వర్, తహసిల్దారులు కనకయ్య, శ్రీనివాస్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.