calender_icon.png 10 May, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో వివాదంలో ప్రొఫెసర్ సుజాత

08-05-2025 01:24:22 AM

  1. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా పోస్ట్
  2. భగ్గుమంటున్న బీజేపీ శ్రేణులు

కరీంనగర్, మే 7 (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మరో వివాదంలో చిక్కుకున్నారు. భారత ప్రభుత్వం పాక్ ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్‌పై చేసిన పోస్ట్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రొఫెసర్ సుజాత సామాజిక మాధ్యమంలో ‘సిందూరం అంటే రక్త సిందూరం లాంటిదా? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని..

యుద్ధాలు శవాలను, శకలాలను మాత్రమే మిగులుస్తాయి గానీ శాంతిని కాదు’ అంటూ పోస్ట్ చేశారు. ప్రొఫెసర్ సుజాత తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు. ఒకవైపు భారత సైన్యానికి సంఘీభావంగా గురవారం హైదరాబాద్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించగా, ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్యలు భారత సైన్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి.

మన సైన్యాన్ని అవమానిస్తున్నట్టే ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెసర్ సుజాత తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, 2018లో కరీంనగర్‌లో దళిత బహుజనులకు, మితవాద గ్రూపులకు మధ్య వివాదం సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది.

తాజాగా ఆపరేషన్ సిందూర్‌పై చేసిన పోస్ట్ సైతం వివాదానికి దారితీసింది. ఇది ప్రొఫెసర్ చేసిన వ్యక్తిగత పోస్ట్ అయినప్పటికీ, సైనికుల మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదని బీజేపీ నేతలు అంటున్నారు.