07-10-2025 10:15:28 PM
మరొకరికి గాయాలు..
ఘట్ కేసర్ (విజయక్రాంతి): రైలు బోగీ తలుపు వద్ద కూర్చున్న అన్నదమ్ములను వెనుకాల నుండి కాలితో తన్ని తోయడంతో కిందపడి ఒకరు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలైన సంఘటన ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై లక్ష్మిపతి తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ నుండి కాజీపేట వైపు వెళ్తున్న దక్షిణ్ ఎక్స్ ప్రెస్ రైలులో మధ్యప్రదేశ్ రాష్ట్రం బోపాల్ లోని బయరాగడ్ హుజుర్ ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు హర్ష్ చంద్వాని(25), అజయ్ రాంచంద్ర చంద్వాని(30) లు బోగి తలుపు దగ్గర కూర్చున్నారు. ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధి 220/20 మైలు రాయి వద్దకు రైలు రాగానే గుర్తు తెలియని వ్యక్తి వెనుకాల నుండి వారిని కాలితో తన్నడంతో కింద పడిపోయారు.
ఈ ప్రమాదంలో తమ్ముడు హర్ష్ చంద్వాని తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా అన్న అజయ్ రాంచంద్ర చంద్వానికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది. అప్రమత్తమైన రైల్వే పోలీసులు బోగి దగ్గరకు వచ్చి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం, క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుని వద్ద ఏలాంటి ఆధారాలు లభించలేదని, మానసిక స్థితి సక్రమంగా లేదని అనుమానిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.