31-08-2025 12:00:00 AM
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి ): సామాజిక రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ రాష్ర్ట క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయ న మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఈ అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్టాన్ని 285 ( ఏ) సవరించాలని క్యాబినెట్ నిర్ణయించడం అభినందనీయమన్నారు.
రాష్ర్ట అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసిన తర్వాతనే ప్రత్యేక జీవోను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చేయబోయే చట్టంపై అఖిలపక్ష రాజకీయ పార్టీలు బేషరతుగా మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ అంశంపై రాజకీయం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మద్దతు ఇవ్వని రాజకీయ పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటిస్తామని హెచ్చరించారు. మోకాలుకు బోడిగుండుకు మెలిక పెట్టి రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూసే పార్టీలను రాజకీయంగా బొంద పెడతామన్నారు.
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసిన తర్వాత రెండోసారి ఆపే అధికారం గవర్నర్‌కు లేదని, గవర్నర్ ఆమోదించకుంటే బీజేపీ బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటికైనా బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల పెంపునకు అన్ని రాజకీయ పార్టీలు, శాసనసభ పక్ష నేతలు, శాసనసభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీసీ నాయకులు సంగని మల్లేశ్వర్, చలమల్ల వెంక టేశ్వర్లు, చంద్రశేఖర్ గౌడ్, భిక్షపతి, జాజుల లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.