29-07-2025 04:18:40 PM
భగత్ సింగ్ నగర్ బస్తి వాసుల స్పష్టీకరణ
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గల భగత్ సింగ్ నగర్, దీపక్ నగర్, శ్రీపతి నగర్ లకు వెళ్ళే రోడ్డు నిర్మాణం పనులను సింగరేణి యాజమాన్యం వెంటనే ప్రారంభించాలని లేకుంటే జిఎం కార్యాలయం ముట్టడించడంతో పాటు జిఎం కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు భగత్ సింగ్ నగర్ కాలనీ వాసులు రాయబారపు కిరణ్, వెంకన్న రసూల్ లు స్పష్టం చేశారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. మార్కెట్ భగత్ సింగ్ నగర్ 14వ వార్డు లోని రోడ్డు ,16 వ వార్డ్ దీపక్ నగర్, శ్రీపతి నగర్ లకు ముఖ్య కూడలి లాంటి దని అలాంటి భగత్ సింగ్ నగర్లో ఇదివరకు వేసిన రోడ్డు పూర్తిగా పాడైపోయిందని గుంతల మయంగా మారి నడవడానికి, వాహనదారులకు తీవ్ర అసౌకర్యంగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ కాలనీవాసులు ఆరుసార్లు సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేసినప్పటికీ ఏరియా జీఎం, సింగరేణి ఉన్నతాధికారులు పట్టించు కున్న పాపాన పోలేదని వారు సింగరేణి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణం కోరుతూ గతంలో చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ దృష్టికి పలుమార్లు తీసుకుపోగా సింగరేణి అధికారులను రోడ్డు నిర్మాణం చేపట్టాలని మంత్రి ఆదేశించినప్పటికీ ఇంతవరకు రోడ్డు నిర్మాణం చేపట్టలేదని వారు వాపోయారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రోడ్డు గుండా నడవాలంటేనే భయపడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి ఏరియా జిఎం స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణంలో సింగరేణి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బస్తివాసులు అందరితో కలిసి జిఎం కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.