5 March, 2026 | 9:42 PM

సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం

05-03-2026 12:00 AM

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చావ రవి, ఏ వెంకట్

ముషీరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): కస్తూర్భా గాంధీ బాలికల విద్యాల యాల్లో, పట్టణ గురుకులాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, సమగ్రశిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తాత్సార వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) ఆధ్వర్యంలో దశలవారీ పోరాటం చేయాలని నిర్ణయించినట్లు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, ఏ వెంకట్‌లు వెల్లడించారు.

ఈ మేరకు బుధవారం వారు ఇక్కడ మాట్లాడుతూ కేజీబీవీ, యు ఆర్ ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్నాయని, రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నా వేతనాలు అరకొరగానే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మూడు దశల పోరాటంలో భాగంగా మార్చి 9న పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో భోజన సమయంలో నిరసన ప్రదర్శనలు, మార్చి 16న జిల్లా కేంద్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 20న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.