03-08-2025 12:41:41 AM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని ఒక ప్రైవేటు హోటల్లో శనివారం రోజున చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణను ఎడారి ప్రాంతంగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్ పర్యటనకు వస్తున్నారని, చొప్పదండి నియోజకవర్గం రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని పంట పొలాలు ఎండిపోయి రైతుల హరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల క్యూసెక్కుల గోదావరి వరద నీరు సముద్రంలో కలుస్తున్నధని ఆ నీటిని ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. నీటిని విడుదల చేసిన తర్వాతే జిల్లా పర్యటనకు రావాలని లేనిచో రైతులతో కలిసి మంత్రుల పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రైతులు పంట పొలాలకు నీళ్లు లేక బిందెల ద్వారా ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీటిని సరఫరా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుంటె ప్రభుత్వం ప్రభుత్వం కళ్లు మూసుకొని చూస్తుంది తప్ప నీటిని ఎత్తిపోయడం లేదన్నారు. ఎస్సారెస్పీ మిడ్ మానేరు ఎల్ఎండి రిజర్వాయర్లను నీటి నిలువ తగ్గిపోయిందని, నారాయణపూర్ ఎంఎండి ఎల్ఎండి రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీరు అందించాల్సిందిగా కోరారు. దయచేసి రైతులకు నీళ్లు ఇవ్వండని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా చొప్పదండి నియోజకవర్గం లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు.