01-07-2025 02:20:38 AM
దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్
చెరువుగట్టు దేవాలయంలో ప్రత్యేక పూజలు
నల్లగొండ టౌన్, జూన్ 30 : నార్కెట్ పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. సోమవారం ఆమె చెరువు గట్టు లో ఉన్న శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి ,ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ముఖ్యకార్య నిర్వహణ అధికారి ఛాంబర్ లో దేవాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎస్. వెంకట్రావు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ముందుగా రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు దేవాలయానికి సంబంధించి 44 ఎకరాల స్థలం గుట్టపైన ఉండగా,కింద 90 ఎకరాల స్థలం ఉందని,ప్రస్తుతం దేవాలయ నిధులు 24 కోట్లు ఉన్నాయని, సంవత్సర ఆదాయం 14 నుండి 16 కోట్లు వస్తున్నదని, రెండు కిలోల 640 గ్రాముల బంగారు ,241 కిలోల వెండి ఉన్నట్టు వివరించారు.
ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి మహత్యం, దర్శనానికి ఇతర జిల్లాల నుండి ,ప్రత్యేకించి అమావాస్య రోజు లక్షల సంఖ్యలో వచ్చే ప్రజలు, ఆదాయం అన్ని తెలుసుకున్న తర్వాత రాబోయే 20, 30 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే విషయం పై సమీక్షించారు. భక్తుల వసతికి డార్మెటరీ నిర్మాణాన్ని చేపట్టాలని, గుట్టపైన ,కింద వాహనాలు ఆపేందుకు పార్కింగ్ అభివృద్ధి చేయాలని, ప్రణాళిక ప్రకారం స్థపతి సూచనలు,సలహాల మేరకు టాయిలెట్లు నిర్మించాలని, గిరిప్రదక్షిణకు ప్రణాళిక రూపొందించాలని, కళ్యాణ మండపం విస్తరించడానికి, అలాగే గుట్ట పైకి వెళ్ళడానికి, ముఖ్యంగా మూడు గుండ్ల వద్దకు వెళ్లేందుకు నడకదారి ప్రణాళిక రూపొందించాలని, శాస్త్రీయ పద్ధతిలో క్యూలైన్ల నిర్మాణం చేపట్టాలని, వాహన మండపం, గోశాల, ప్రస్తుతం ఉన్న నడకదారికి మరమ్మతు, సీసీ కెమెరాల పెంచడం, దేవాలయ భూమికి సంబంధించి భూ సేకరణ పూర్తి చేయడం, చెరువు, కోనేరు అభివృద్ధి కి అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందించాలన్నారు. జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని ,ఇకపై చేపట్టే అన్ని పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారమే చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ధార్మిక పరిషత్ ప్రత్యేక సలహాదారు గోవింద హళ్లి, స్థపతి వళ్ళీనాయగం, ఆర్కిటెక్చర్ సూర్యనారాయణమూర్తి, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డిఎస్పి శివరాం రెడ్డి, దేవాదాయ శాఖ ఎస్ ఈ ఓంప్రకాష్, ఈఈ శ్రీనివాస శర్మ, స్థానిక అధికారులు, తదితరులు ఈ సమీక్షయ సమావేశానికి హాజరయ్యారు.