08-05-2025 12:39:35 AM
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల, పెన్షనర్ల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి వేసిన నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్‌తో కూడిన ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీ బుధవారం సచివాలయంలో ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశమైంది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది.
సమావేశంలో పెండింగ్‌లో ఉన్న 57డిమాండ్లను ఒకొక్కటిగా జేఏసీ నేతలు చదివి వివరించగా, అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్ అన్ని డిమాండ్లను నోట్ చేసుకున్నారు. జేఏసీ నేతలు వివరించిన ప్రతీ అంశాన్ని కమిటీ సావధానంగా విన్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఈ 57 డిమాండ్లలో ఆర్థిక పరమైన 12 డిమాండ్ల గురించి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలకు కమిటీ ఇప్పుడే ఎలాంటి హామీనివ్వలేదు.
కేవలం ఆర్థికేతర డిమాండ్లపైనే ఎక్కువగా చర్చించారు. ఇందులోనూ చేయగలిగినవన్నీ చేస్తామని కమిటీ పేర్కొన్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ప్రతీ సమస్యపై అధికారుల కమిటీ చర్చించి సాధ్యాసాధ్యాలను చూసి పరిష్కరిస్తామని మాత్రం నేతలకు భరోసా ఇచ్చింది.
క్యాబినెట్ సబ్‌కమిటీతో చర్చించిన తర్వాత..
తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెబుతోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇదే స్పష్టం చేశారు. ఈక్రమంలోనే జేఏసీ నేతలతో భేటీ అయిన అధికారుల కమిటీ కేవలం ఆర్థికేతర అంశాలైన 45 డిమాండ్ల పరిష్కారానికే ఎక్కువగా దృష్టిసారించినట్లు తెలిసింది. ఈ అంశాలకు సంబంధించి ఏమై నా వివరాలను ఇవ్వదలుచుకుంటే గురువారం తమకు ఉద్యోగ సంఘాల నేతలు కలిసి ఇవ్వాలని కమిటీ సూచించింది.
ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ఆయా విభాగాల సెక్రటరీల నుంచి వివరాలను తె ప్పించుకుని అధికారుల కమిటీ త్వరలోనే చర్చించనుంది. ఈ కమిటీ చర్చించిన తర్వా త డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రు లు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్‌కమిటీతో అధికారులు చర్చించనున్నారు. అనంతరం మరోసారి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలతో అధికారుల కమిటీ సమావేశమై చర్చించనుంది.
డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, పీఆర్సీ నివేదికను తెప్పించుకోవాలని, పదోన్నతులు కల్పించాలని, డీఈవో, ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలని కమిటీకి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థికపరమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కమిటీ స్పష్టం చేసినట్లు జేఏసీ నేతలు తెలిపారు.
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందేనన్న ఉద్యోగులు..
పాత పెన్షన్ పునరుద్ధరణకు ఎలాంటి ఆర్థిక భారం కాదని, ప్రభుత్వం నెలనెల చందా చెల్లించే బదులు సీపీఎస్ రద్దు చేస్తే ప్రభుత్వానికే నెలకు రూ.300 కోట్లు మిగిలే అవకాశముందని జేఏసీ నేతలు కోరారు. ఇప్పటివరకు 14 నెలల నుంచి జమకాని కంట్రిబ్యూషన్ రూ.6వేల కోట్లు ఉంది.
ఇప్పటికే ఎన్‌పీఎస్ ట్రస్ట్‌తో రూ.16వేల కోట్ల ఫండ్ తరలి వెళ్లింది. దీంతో సీపీఎస్‌ను రద్దు చేస్తే రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందని, వాటిని ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించుకోవ్చని జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్‌రావు, స్థితప్రజ్ఞ వివరించినట్లు తెలిపారు.
ఉద్యోగ సంఘాల హర్షం..
తమ డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కమిటీ వేసి చర్చించేందుకు పిలవడం శుభపరిణామమని జేఏసీ నేతలు తెలిపారు. ముగ్గురు అధికారులు కూడా ప్రతీ అంశాన్ని సావధానంగా విన్నారని, ఎలా చేస్తే బాగుంటుందో తమతో కూలంకషంగా చర్చించారని పేర్కొన్నారు. టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా మరింత లోతుగా చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నుంచి దాదాపు యాభైమంది హాజరయ్యారు. ముఖ్యంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, అడిషనల్ సెక్రటరీ జనరల్ దామోదర్‌రెడ్డి, కోచైర్మన్లు చావ రవి, వంగ రవీందర్‌రెడ్డి, సదానందంగౌడ్, ముజీబ్ హుస్సేని, మధుసూదన్‌రెడ్డి, స్థితప్రజ్ఞ, బీ శ్యామ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
భేటీలో పెద్దగా టచ్ చేయని ఆర్థికపరమైన డిమాండ్లివే..
పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లు లు, 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు, ప్రభుత్వం సమాన వాటాతో ఉద్యోగుల ఆరోగ్య పథకం, కొంగరకలాన్ వద్ద రంగారెడ్డి జిల్లా ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ మంజూరు, స్పెషల్ టీచర్స్‌కు నోషనల్ ఇంక్రిమెంట్స్, వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న మూడు పీఆర్‌పీల అమలు, మారుమూ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపక వైద్యులకు ప్రత్యేక అలవెన్సులు మంజూరు,
అంగన్వాడీటీచర్లు, వర్కర్లకు స్వచ్ఛంద పదవీ విరమణతోపాటు విధుల్లో ఉండి మరణించిన అంగన్‌వాడీలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, అధికారుల అద్దెవాహనాల రెండు సంవత్సరాల బిల్లులు, వాటి నెలవారి కిరాయి చార్జీలు పెంచాలి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పదోన్నతులు కల్పించాలి.