05-12-2024 02:09:23 AM
* ప్రజల ప్రేమే ప్రభుత్వానికి ఆక్సిజన్
* పెద్దపల్లి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పెద్దపల్లి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ప్రజలు చూపించే ప్రేమాభిమానులు ప్రభుత్వానికి ఆక్సిజన్ లాంటివని.. వారి కోసం మరిన్ని మంచి పనులు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఆయన ప్రసంగించారు. యువత ముఖంలో చిరునవ్వు కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉద్యోగాల కోసం సాధించు కున్న రాష్ట్రంలో గత పదేళ్లు మోసపోయామన్నారు. ఏడాది కాలంలో 55,143 మందికి నియామక పత్రాలు అందించామని, టీజీ పీఎస్సీ ద్వారా ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అందించి ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.
యువత సాంకేతికంగా బలంగా ఉండాలనే ఆలోచనతో స్కిల్ యూనివర్సిటీ, 67 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. సింగరేణి కార్మికులకు గతంలో లేని విధంగా రూ.కోటి ప్రమాద బీమా అందించామని, పెద్దపల్లి జిల్లాలో రూ.వెయ్యి కోట్లకుపైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని వివరించారు. ప్రజా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. తమ ప్రభుత్వం పనులపైనే దృష్టి సారించింది.. ప్రచారాలపై కాదని స్పష్టం చేశారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రామగుండంలో నూతన పవర్‌ప్లాంట్‌కు త్వరలో భూమిపూజ చేస్తామన్నారు. ఉమ్మ డి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులను వినియోగిస్తూ రికార్డుస్థాయిలో వరి సాగు చేస్తామని భట్టి పేర్కొన్నారు.