02-08-2025 12:07:25 AM
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు
జహీరాబాద్, ఆగస్టు 1 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని పిరమిల్ పరిశ్రమలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికుల యొక్క నడ్డి విరుస్తూ కార్పొరేట్లకు స్వాగతం పలుకుతున్నారని విమర్శించారు.
కార్మికుల సంక్షేమం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేయడం సరికాదన్నారు. కార్మికులు ఐక్యంగా పోరాడితేనే హక్కులు రక్షించుకుంటామని, కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యేదాకా పోరాటం ఆగదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేష్, క్లస్టర్ కన్వీనర్ ఎం మహిపాల్, యూనియన్ ప్రధాన కార్యదర్శి నరసయ్య, నాయకులు మాణిక్ రెడ్డి, ప్రభువు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.