01-09-2025 01:52:24 AM
-మరోసారి బిల్లును గవర్నర్‌కు పంపిస్తాం
-కోటాను మరో పదేళ్లు వాయిదా వేయాలని బీఆర్‌ఎస్ ప్లాన్
-మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లు అమలు ఇంకో పదేళ్లు వాయిదా పడాలని బీఆర్‌ఎస్ నాయకులు చూస్తున్నారని, అయితే తాము మాత్రం 42 శాతం రిజర్వేషన్లు చేసి తీరుతామని మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై శాసనసభలో మంత్రి మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదంపై పాజిటివ్ దృక్పథంతో బీఆర్‌ఎస్ నాయకులుండాలని, ఎందుకు నెగిటివ్‌గా ఆలోచిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
గవర్నర్‌కు మరోసారి పంపిస్తామని, బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. మూడ్ ఆఫ్ హౌజ్ విషయాన్ని గవర్నర్‌కు తెలిసేలా చర్చ జరగాలన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నామని, బలహీన వర్గాలకు సంబంధించి ఏ ప్రభుత్వం చేయలేని రేతిలో తెలంగాణ సైంటిఫిక్ డేటాను సమీకరించిందన్నారు. ప్రతి ఇంటి గడపకు వెళ్లి డేలా సేకరించామన్నారు. విద్యా ఉపాధి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ఎన్నిరోజులైనా సభను నడిపేందుకు సిద్ధం..
బిల్లుపై బీఆర్‌ఎస్ అభిప్రాయం చెప్పాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రిజర్వేషన్ల అమలు చేయాల్సి ఉందని, లేకుంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు న్యాయం చేస్తామని తమ నాయకుడు రాహుల్ అన్నారని ఆయన చెప్పారు. కేంద్రం చేయాల్సిన దానిని తమపై నెపం నెడుతున్నారని బీఆర్‌ఎస్, బీజేపీ లేవనెత్తిన అంశాలపై మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిచ్చారు.
బీసీ బిల్లుపై ఏకవ్యాఖ్యంలో ఆయా పార్టీలు తమ తమ అభిప్రాయం చెప్పాలని, బిల్లు ఆమోదానికి మద్దతు ప్రకటించాలని కోరారు. చరిత్రలో తాము ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని తమ నాయకుడు రాహుల్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తాము ఎన్నిరోజులైనా సభను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సభను నడపకుండా తామేమీ పారిపోలేదని, మీరే పారిపోయారని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, ఇక్కడే ఉంటామని ఆయన తెలిపారు.