03-09-2025 07:03:28 PM
పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): 5 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 104 ఉద్యోగులు, సిబ్బంది నిరసన 2వ రోజు కొనసాగింది. జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్ష లో భాగంగా బుధవారం వర్షం ను సైతం లెక్క చేయకుండా సిబ్బంది తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా 104 ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యక్షులు మామిడి వెంకన్న మాట్లాడుతూ... గత 17 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగులకు కనీసo వేతనాలు లేకుండా విధులకు హాజరవుతున్న పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం 104 ఉద్యోగులను PHC, UPHC, RIMS, TB ఆఫీస్, T-హబ్ వంటి విభాగాల్లో అడ్జెస్ట్మెంట్ చేసి విధుల్లో ఉంచారు.
అయితే, 2025 ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు 5 నెలల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు. అలాగే ఉద్యోగాల కంటిన్యూషన్ పై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల, ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అనేక మార్లు ఉన్నత అధికారులను కలిసి విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు. వర్షాకాలం, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో 104 ఉద్యోగుల పని చేస్తున్న చోట వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది ప్రజారోగ్యానికి నష్టాన్ని కలిగించనుందని తెలిపారు. కనీసం వేతనాలు చెల్లించక, ఉద్యోగులను వెట్టి చాకిరీకి గురి చేస్తున్నారని వాపోయారు.