calender_icon.png 3 September, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

03-09-2025 07:07:37 PM

కుమ్రంభీం  ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా తోడ్పాటు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో ఇందిరా మహిళ శక్తి పథకం క్రింద ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు కుందారపు రాణికి రూ.10 లక్షలతో మంజూరైన మొబైల్ చేపల విక్రయ వాహనం యూనిట్ ను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అనేక వ్యాపారాలు చేసేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అందిస్తున్న రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

బూర్గుడ గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘం సభ్యురాలు 4 లక్షల రూపాయల సొంత నిధులు, 6 లక్షల రూపాయల ప్రభుత్వ రాయితీ నిధులతో సంచార చేపల విక్రయ వాహనం నిర్వహించేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని, మహిళలు వ్యాపారాలు నిర్వహించి ఆర్థిక స్వావలంబన పొందడమే కాకుండా కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.