01-09-2025 01:50:33 AM
-రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్లు సాధ్యం
-చట్టాలను శాస్త్రీయంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు
-బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు
-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ బిల్లు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలని, అంతవరకు ఆయన అక్కడే ఉండాలని సవాల్ విసిరారు. శాసనసభలో పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేపథ్యంలో జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పంచాయతీరాజ్ బిల్లులో రాజకీయ, సామాజిక స్థితిగతులు లేవన్నారు. చట్టాలను శాస్త్రీయంగా, పకడ్బందీగా అమలు చేస్తే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఈ బిల్లుల విషయంలో న్యాయస్థానాలకు వెళ్లొద్దని ప్రభుత్వం చెప్పడం సరైంది కాదని.. ఎవరైనా వెళ్లొచ్చని, చట్టాలను సక్రమంగా చేస్తే చిక్కులు రావన్నారు. ఇప్పటివరకూ సీఎం 52సార్లు ఢిల్లీకి వెళ్లారని, ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలుకోసం ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు.
సుప్రీం కోర్టే సీలింగ్ పెట్టింది..
50 శాతం రిజర్వేషన్లు సీలింగ్‌ను పెట్టింది తమ ప్రభుత్వం కాదని, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సీలింగ్ పెట్టిందని కేటీఆర్ చెప్పారు. బీసీలను న్యాయం చేయాలంటే మరో పదిరోజులైనా ఈ సభలో చర్చ జరిగినా 42 శాతం రిజర్వేషన్లు అమలు కావని, 50 శాతం సీలింగ్ తీసేలా పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారానే అది సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
కానీ అలాకాకుండా కాంగ్రెస్ పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందని, ఆర్డినెన్స్ తీసుకొస్తామని, పార్టీపరంగా అమలు చేస్తామని, రాహుల్ ప్రధాని అయ్యాక చేస్తామని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో దీనిపై రాహుల్‌గాంధీ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ప్రశ్నించారు. తాము నాడు చేపట్టిన ఇంటింటి సర్వేలో రాష్ర్టంలో ఉన్న బలహీనవర్గాల సంఖ్య 52 శాతంగా తేలిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 6 శాతం ఎలా తగ్గింది? అని, తాము పాల్గొనకపోతేనే 6 శాతం తగ్గుతుందా? అని ప్రశ్నించారు.
బీసీ సబ్ ప్లాన్ తీసుకురావాలి..
గతంలో యూపీఏ ప్రభుత్వంలో తాము భాగస్వాములుగా ఉన్నప్పుడు రాష్ర్టంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కేసీఆర్‌సూచించారని కేటీఆర్ తెలిపారు. అలాగే బీసీలకు బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ పదవులను ఇచ్చిందని, బీసీని మొదటి అడ్వొకేట్ జనరల్‌గా చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని తెలిపారు. తమ పార్టీలో మూడు ప్రొటోకాల్ పొజిషన్లను బీసీలకే ఇచ్చామని స్పష్టం చేశారు.
చట్టసభల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. కానీ, బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే నాలుగుసార్లు మాట మార్చారని, సీఎం చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో ఏమీ కాదని, బీసీ సబ్ ప్లాన్ చట్టం తేవాలని, దానిపై చర్చ జరిపేందుకు సభ నిర్వహించాలని కోరారు. 15 రోజులు సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
సభను నిర్వహించాలని కోరితే ప్రభుత్వం పారిపోతోందని విమర్శించారు. నాడు తమ ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో నెం.396 జారీ చేస్తే దానిపై సీఎం రేవంత్‌రెడ్డి బంధువు గోపాల్‌రెడ్డి అడ్డుకునేందుకు కోర్టుకెళ్లారని ఆరోపించారు. గతంలో గవర్నర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను పంపితే దానిపై సంతకం చేయని గవర్నర్...ఇప్పుడెలా జీవోపై సంతకం పెడతారు? ఆయన చేయి పట్టి సంతకం పెట్టిస్తారా? అని ప్రశ్నించారు.