03-09-2025 07:26:48 PM
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ పర్యటనలో చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) స్పందించారు. పాలమూరులో యూరియాకు దిక్కు లేదని.. యూరియా కోసం రాత్రింబవళ్లు రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి ఏం లాభం..? యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే అసలు యూరియా కొరత లేదని, యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చిన వారు రైతులు కాదని అనడం వారి చిత్తశుద్ధి, నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టారని.. వ్యక్తిగత ప్రతిష్ట కోసం కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని అన్నారు. కొడంగల్ ఎత్తిపోతలను ఎన్జీటీలో కేసులు వేశారని రేవంత్ ఆరోపించడం హాస్యాస్పదమని.. వందల కేసులతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
నాటి పాలమూరు వలసలు, కరువు, కన్నీళ్లకు కారణమే దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలన అని, తెలంగాణ ఉద్యమానికి పాలమూరు ప్రాతిపదిక అయిందని అన్నారు. రెండేళ్లలో పాలమూరుకు ఏం చేశాడో రేవంత్ చెప్పాలి.. ఏం అభివృద్ధి చేశాడని మరోసారి రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలి..? అని విరుచుకుపడ్డారు. కేసీఆర్ హయాంలో మంజూరైన మెడికల్ కళాశాలను కొడంగల్ కు తరలించిన రేవంత్ రెడ్డి.. కళాశాలల మంజూరు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు, ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేసింది కేసీఆర్ హయాంలోనే అన్నది మరిచిపోవద్దన్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, సాగునీరు, పారిశుధ్యం, గ్రామాల నుండి మండలం, మండలం నుండి జిల్లాలకు రహదారులు నిర్మించడం జరిగిందన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్లింది పాలమూరులో నివసించి ఉంటే తెలిసేదని.. 52 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఒక్క రూపాయి నిధులు గానీ, ఒక కొత్త కళాశాల గానీ తీసుకురావడంలో విఫలమయ్యారని తెలిపారు. రేవంత్ రెడ్డిది చిత్తశుద్ధి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం మూలంగా కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుక పోతున్నదని.. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను అవహేళన చేసినందుకే తెలంగాణలో టీడీపీ పార్టీ అంతర్ధానం అయిందన్నారు. ఆత్మాభిమానం, స్వయం పాలన, స్వాభిమానం ప్రతీకగా ఎగిసివచ్చిన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఆకాంక్ష ఇప్పటికీ రేవంత్ రెడ్డికి అర్ధం కాకపోవడం దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ ఆకాంక్షలను పట్టించుకోని టీడీపీ తెలంగాణ నుండి అదృశ్యం అవుతుందని చెప్పాం.. అదే జరిగిందని, బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి టీడీపీతో పోల్చడం విడ్డూరంగా ఉందన్నారు.