calender_icon.png 9 July, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచుతాం

09-07-2025 12:00:00 AM

  1. మంత్రి పొన్నం ప్రభాకర్

కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్: మేయర్ విజయలక్ష్మి

శానిటేషన్ సిబ్బందికి హెల్త్ కిట్ల పంపిణీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా హైదరాబాద్ నగరాన్ని అద్దంలా పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.

మంగళవారం బంజారాహిల్స్‌లోని కుమ్రంభీం భవన్‌లో జీహెచ్ ఎంసీ శానిటేషన్ సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని, హెల్త్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందనలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులున్నా, కార్మికుల జీతాల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని చెప్పారు.

అర్హులైన కార్మికులకు, స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, కార్మికుల పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా గురుకులాల్లో సీట్లు ఇచ్చి చదివించే బాధ్యత తమది అని హామీ ఇచ్చారు. మేయర్ విజయలక్ష్మిమాట్లాడుతూ.. కార్మికులు విధి నిర్వహణలో మరణించినా లేదా వృద్ధాప్యంతో పనిచేయలేకపోయినా వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద తిరిగి ఉపాధి కల్పించేందుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుందని మేయర్ కీలక ప్రకటన చేశారు.

నగరం విస్తరించినందున కార్మికుల సంఖ్యను కూడా పెంచుతామని తెలిపారు. కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. శానిటేషన్ సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా భావించి, వారి ఆరోగ్య రక్షణకు ఖర్చుకు వెనుకాడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ శిబిరాలు నగరవ్యాప్తంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.