24-02-2026 12:18:07 AM
‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో డీసీపీ రాహుల్ రెడ్డి
సికింద్రాబాద్/జవహర్‌నగర్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): హెల్మెట్ ధరించడం ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడుకోవచ్చని మల్కాజ్గిరి ట్రాఫిక్ డిసిపి కె. రాహుల్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ కార్యక్రమం ఫేజ్-2లో రైడ్ సేఫ్, రైడ్ స్మార్ట్ అవగాహనలో భాగంగా సోమవారం ద్విచక్రవాహనదారుల ప్రాణాలను కాపాడేందుకు మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమాన్ని సోమవారం సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలో నిర్వహించారు.
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ట్రాఫిక్ డిసిపి కె.రాహుల్ రెడ్డి , అదనపు డిసిపి ఏ. శ్రీలక్ష్మి,ఏసిపి చంద్రశేఖర్ రెడ్డి హాజరై హెల్మెంట్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ట్రాఫిక్ డిసిపి రాహుల్ రెడ్డి మాట్లాడుతూ చలాన్ వేయడం పోలీసుల డ్యూటీ కాదన్నారు. మొదటి హెల్మెట్ బ్యాంకును సంగీత్ చౌరస్తాలో ప్రారంభించగా రెండో హెల్మెట్ బ్యాంకును బేగంపేట్ పరిధిలో మంగళవారం ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గోపాల పురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.రవి కుమార్, జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ నరసింహ పాల్గొన్నారు.
మితిమీరిన వేగం.. ప్రమాదం
ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని.. మితిమీరిన వేగం.... ప్రాణాలకే ప్రమాదమని జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదయ్య తెలిపారు. కీసర సర్కిల్ జవహర్ నగర్ చెన్నాపురం చౌరస్తాలో అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎస్సై వేణుమాధవ్ పాల్గొన్నారు.