నిధుల దుర్వినియోగం సహించం
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
- ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
నాగర్ కర్నూల్, జూన్ 11 (విజయక్రాంతి): కేజీబీవీ పాఠశాలల్లో విద్యార్థినులకు అందించాల్సిన ఆహారం, వసతి, ఇతర సదుపాయాలను దారి మళ్లించడం అత్యంత ఘోరమైన చర్య అని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాజిపేట్ కేజీబీవీ సిబ్బంది చేసిన ఫిర్యాదులోని ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై ఎలాంటి కనికరం లేకుండా శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని తెలిపారు.
గురువారం తిమ్మాజిపేట కస్తూర్బా బాలికల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు రామకృష్ణలు అదే పాఠశాల ప్రత్యేక అధికారిపై ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు స్పందిస్తూ బాలికల సంక్షేమ నిధులను దుర్వినియోగం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమన్నారు. విద్యార్థినుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై సమగ్ర విచారణ జరిపించి, నిధుల దుర్వినియోగం జరిగితే ప్రతి పైసా రికవరీ చేయించడంతో పాటు కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.






