20-12-2025 12:27:38 AM
ఆలంఘిర్ మజీద్‌ను సందర్శించిన మంత్రి మహమ్మద్ అజారుద్దీన్
శేరిలింగంపల్లి,డి, సెంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు పరిధిలోని భూములు అన్యాక్రాంతం కాకుం డా అన్ని శాఖల అధికారులు సమన్వయం తో చర్యలు తీసుకోవాలని మైనార్టీ వెల్ఫేర్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ సూచించారు. శుక్రవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆలంఘిర్ మజీద్ను మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మైనార్టీ ప్రతినిధులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం గుట్టల బేగంపేట్ ప్రాంతంలో సర్వే నంబర్లు 1 నుంచి 9 వరకు ఉన్న వక్ఫ్ బోర్డు భూములను పరిశీలించారు.
ఈ సందర్భంగా మజీద్ నిర్వాహకులు, మైనార్టీ ప్రతినిధులు వక్ఫ్ భూములపై జరుగుతున్న అన్యాక్రాంతాల అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ నగరంతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల విలువైన వక్ఫ్ బోర్డు భూములు కబ్జాలకు గురవుతున్నాయని, గుట్టల బేగంపేట్లో సర్వే నంబర్లు 1 నుంచి 9 వరకు విస్తరించి ఉన్న సుమారు 90 ఎకరాల వక్ఫ్ భూములపై ఆక్రమణ ప్రయత్నాలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
వక్ఫ్ బోర్డు గుర్తించిన భూముల పరిరక్షణ మైనార్టీ వెల్ఫేర్ శాఖ బాధ్యత మాత్రమే కాదని, రెవెన్యూ సహా సంబంధిత అన్ని శాఖలు బాధ్యతగా వ్యవహరించి భూములను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.