calender_icon.png 11 November, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీలో మళ్లీ వెల్ఫేర్ కమిటీలే

12-09-2024 12:23:21 AM

  1. సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం 
  2. కేసీఆర్ బాటలోనే రేవంత్ సర్కారు 
  3. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మికులు 
  4. యూనియన్ గుర్తింపు కోసం పోరాటం 
  5. ఆరేళ్లుగా ఎన్నికలు నిర్వహించని ఆర్టీసీ 
  6. 21న జేఏసీ సామూమిక నిరాహార దీక్ష 

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ కార్మికుల కష్టాలు మాత్రం తీరడం లేదు. పెండింగ్ సమస్యలు నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వాలు కనీసం వారికి గుర్తింపును ఇచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదు. పైసా ఖర్చు కాని ట్రేడ్ యూనియన్ పునరుద్ధరణకు కాంగ్రెస్ సర్కారు కూడా నైనై అంటోంది. గత సీఎం కేసీఆర్ బాటలోనే ఆయన కూడా నడుస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు అంగీకరిచకుండా ఆర్టీసీ యాజమాన్యం తిరిగి వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు అన్ని డిపోలకు ఆదేశాలు జారీ చేసింది. వెల్ఫేర్ కమిటీలు అంటే ప్రతి ఆర్టీసీ డిపో పరిధిలో కేవలం తాము చెప్పింది వినేందుకు గాను ఏర్పాటు చేసుకునే ఇద్దరు సభ్యుల కమిటీ అని కార్మికులు విమర్శిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్ప వేరే మార్గమే కనిపించడం లేదని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. 

ఒక్క హామీ నెరవేర్చలే..

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని సదుపాయాలను కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో చేర్చింది. ఎన్నికల సమావేశాల్లో ఈ హామీలను నాయకులు వల్లెవేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల మాదిరిగానే ఆర్టీసీ కార్మికులు సైతం తమకు మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఇక ఆరు గ్యారెంటీల్లో విజయవంతంగా అమలు అవుతున్న ఏకైక హామీగా పేరున్న మహాలక్ష్మి పథకం.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సవ్యంగా సాగేందుకు ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. డబుల్ డ్యూటీలతో ఇబ్బందులు పెట్టినా విధులు నిర్వహిస్తూ  ఉచిత ప్రయాణానికి అండగా ఉంటున్నారు. కానీ తమ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వాన్ని కార్మికులు వేడుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడంలేదు. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఆర్టీసీ యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తోంది.

గుర్తింపు సంఘం ఎన్నికలకు మొండి చేయి చూపించి వెల్ఫేర్ కమిటీలను తిరిగి నియమించేందుకు యాజమాన్యం సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనిపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన నిజ స్వరూపాన్ని చూపిస్తోందని అంటున్నారు. తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతోందని గ్రహించిన కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ నెల 21న ఇందిరాపార్క్ వద్ద సామూహిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు స్పష్టం చేశారు. 

పైసా ఖర్చు కాని ట్రేడ్ యూనియన్‌ను సైతం పునరుద్ధరించలే..

ఆర్టీసీలో చివరిసారిగా 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పుడు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) గెలిచింది. రెండేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత 2018 నుంచి ఇప్పటివరకు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగలేదు. 2018లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించవద్దంటూ అప్పటి బీఆర్‌ఎస్ సర్కారు మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఎంటీడబ్ల్యూ) యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కానీ ఈ సర్కారు కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తోందని కార్మికులు వాపోతున్నారు.

కాంగ్రెస్ సర్కారు తమ ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రకారం తప్పనిసరిగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తారని కార్మికులు భావించారు. ట్రేడ్ యూనియన్ రద్దు చేసిన తర్వాత వాటి స్థానంలో ప్రతి డిపోలో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొనసాగిన ఆ వెల్ఫేర్ కమిటీలను రద్దు చేస్తారని భావించినా రేవంత్ సర్కారు కూడా అదే బాటలోనే పయనించింది.

తాజాగా ఈ నెల 9వ తేదీన తిరిగి వెల్ఫేర్ కమిటీలను నియమిస్తున్నట్లు డిపో నోటీస్ బోర్డుల్లో అధికారులు ఉత్తర్వులను ఉంచారు. వెల్ఫేర్ కమిటీల కోసం కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని ఈ సర్క్యూలర్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు కోపంలో రగిలిపోతున్నారు. కేసీఆర్ సర్కారు తీరుగానే రేవంత్ సర్కారు కూడా నడుస్తోందని ఆరోపిస్తున్నారు. 

బానిసలుగా కార్మికులు..

వెల్ఫేర్ కమిటీలతో తమకు ప్రయోజనం లేదని, కార్మికులను బానిసలుగా మార్చేసి వేధిస్తూ విధులు నిర్వహించేలా బాధలు పెడుతున్నారని అంటున్నారు. ట్రేడ్ యూనియన్ బదులుగా ఏర్పాటు చేసిన వెల్ఫేర్ కమిటీలకు నిరసన తెలిపేందుకు ఎలాంటి హక్కులు ఉండవని.. కేవలం తమ మాట వినే ఇద్దరిని డిపోల వారీగా వెల్ఫేర్ కమిటీల్లో చోటు దక్కేలా చేశారని కార్మిక నేతలు అంటున్నారు.

ట్రేడ్ యూనియన్ రద్దు చేసిన తర్వాత ఆర్టీసీలో కార్మికులకు వేధింంపులు పెరిగాయని, నిబంధనల మేరకు 8 గంటల విధులుంటే ఇప్పుడు కనీసం 10 నుంచి 16 గంటల వరకు బలవంతంగా పనులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  కార్మికుల సంక్షేమాన్ని పరిష్కరించలేని వెల్ఫేర్ కమిటీలు ఎందుకని, కార్మికులపై విపరీతమైన పనిభారం పెరిగిపోయిందని అంటు న్నారు. ట్రేడ్ యూనియన్ల స్థానంలో వెల్ఫేర్ కమిటీలు చట్టవిరుద్ధమని కార్మికులు పేర్కొంటున్నారు. అందుకే తమకు వేరే దారి లేక నిరా హార దీక్షకు దిగుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలు

  1. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి, రెండు పీఆర్సీల బకాయిలు వెంటనే చెల్లిస్తాం
  2. వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం
  3. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలను కల్పిస్తాం
  4. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం, అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం
  5. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం.

ట్రేడ్ యూనియన్ కోసం పోరాటం చేస్తాం... 

ట్రేడ్ యూనియన్‌లు ఉంటే యాజమాన్యం పప్పులు ఉడవకనే కారణంతోనే వాటిని తిరిగి పురుడు పోసుకోకుండా అడ్డుకుంటున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల ఎలా వ్యవహరించారో రేవంత్ సర్కారు కూడా అలాగే వ్యవహరిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్న మహాలక్ష్మిపథకం విజయవంతంగా అమలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు లేకుండా చేయడం కంటే దారుణం మరోటి ఉండదు.

ట్రేడ్ యూనియన్ గుర్తింపు లేకుండా చేయడం అంటే నిరంకుశత్వంతో పరిపాలించడం వంటిదే. రాజులు, రాజ్యాలు పోయినా ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలు కూడా ఇంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటు. ట్రేడ్ యూనియన్ గుర్తిం పును తిరిగి పునరుద్ధరించకుంటే ఆర్టీసీ జేఏసీ తరఫున పోరాటం కొనసాగిస్తాం.

 థామస్ రెడ్డి, 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎంయూ

ఇది ముమ్మాటికీ చట్ట వ్యతిరేకం.. 

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందింది. గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకుండా వెల్ఫేర్ కమిటీలను తిరిగి ఏర్పాటు చేయడం చట్టవ్యతిరేకం. ఆర్టీసీ జేఏసీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలన్నింటినీ అలాగే తొక్కిపెట్టి ఇప్పుడు మళ్లీ వెల్ఫేర్ కమిటీలను పునరుద్ధరించడం అంటే కార్మికులను అణచివేయడంగానే భావిస్తున్నాం. గత నెల 28న ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్యే కూనంనేని సమక్షంలో ట్రేడ్ యూనియన్‌ను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇంత పెద్ద సంస్థలో ట్రేడ్ యూనియన్ లేకుంటే వారి సమస్యలు, బాధలు ఎవరికి చెప్పుకుంటారని సీఎం అన్నారు. కానీ అప్పుడే మాట తప్పడం దారుణం. ఈ నెల 10న జరిగిన ఆర్టీసీ సమీక్షలో సీఎం కనీసం ఈ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. కార్మికుల పట్ల ప్రభుత్వం తన నియంతృత్వాన్ని ప్రదర్శిస్తుందనే భావించాల్సి వస్తోంది. ప్రభుత్వం, యాజమాన్యం వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 21 సామూహిక నిరాహార దీక్షలు చేపడుతున్నాం. 

  వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్