అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలనుండి గిరిజన దర్బార్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చే గిరిజన కుటుంబాలకు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం నాడు ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున వివిధ సమస్యల గురించి గిరిజన దర్బార్ లో విన్నవించడానికి వచ్చిన గిరిజనుల నుండి యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన అర్జీలు స్వీకరించి, ఐటీడీఏ పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు సిఫారసు చేశారు. అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
గిరిజన దర్బార్ కు ఎక్కువ శాతం గిరిజనులు పోడు భూముల పట్టాల కొరకు, గిరి వికాసం ద్వారా సబ్సిడీపై కరెంటు, బోరు, మోటార్ల కొరకు, పోడు భూముల పట్టాలు ఆన్లైన్ చేయించుట కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కల్పించుట కొరకు, అలాగే భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గిరిజన గ్రామాలలో వ్యవసాయం చేసుకోవడానికి బోరు, మోటార్లు ఇప్పించుట కొరకు, మారుమూల ప్రాంత గిరిజన గ్రామాలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం, కరెంటు ఇప్పించుట కొరకు, నూతనంగా మత్య సొసైటీలు ఏర్పాటు కొరకు, వితంతు, ఒంటరి మహిళ, ఆసరా పెన్షన్లు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన తెలిపారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ప్రత్యేకమైన రిజిస్టర్లో, ఆన్లైన్ ద్వారా నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఆర్సిఓ గురుకులం నాగార్జున రావు, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఎస్ఓ భాస్కర్, ఏపీఓ పవర్ ఏఈ మునీర్ పాషా, ఎస్ డి సి ఉదయ్ కుమార్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఏ టి డి ఓ అశోక్ కుమార్, మేనేజర్ ఆదినారాయణ, కొండరెడ్ల విభాగం అధికారి మనిధర్,హెచ్ ఈ ఓ లింగా నాయక్, ఐసిడిఎస్ సూపర్వైజర్ సౌమ్య, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది మమత, భద్రమ్మ, స్వాతి, జోగారావు తదితరులు పాల్గొన్నారు.




