01-08-2025 12:21:44 AM
-ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
-మదన్ మోహన్ రావు అధికారులతో సమీక్ష
ఎల్లారెడ్డి, జూలై 31 (విజయ క్రాంతి ), ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి దరి చేరాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దిశా నిర్దేశం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో గురువారం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఎమ్మెల్యే మదన్మోహన్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. పేదోడి ఇంటి నిర్మాణం కల నిజం చేయడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా చిన్న చిన్న సాంకేతిక పరమైన సమస్యలు ఉత్పన్నమైతే మానవయ కోణంలో ఆలోచించి పరిష్కారం మార్గం చూపాలని ఆయన సూచించారు. పేదోడికి న్యాయం జరిగే విషయంలో చిన్న చిన్న సాంకేతిక సమస్యల పట్ల ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు సానుకూలంగానే ఉంటారని ఆయన అన్నారు. పేదోడికి న్యాయం జరిగిందంటే అది ప్రభుత్వ విజయమైన అని ఆయన స్పష్టం చేశారు.
అధికారులు చిన్నచిన్న సమస్యల పట్ల శ్రద్ధ చూపడం కాదని వారికి ఎంతవరకు మేలు జరుగుతుందనే కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మీ నిర్ణయం పేదోని కోసమైతే దాన్ని సమర్ధించడానికి నేను ఉన్నానని ఆయన భరోసా ఇచ్చారు. అధికారులు సమయం వృధా చేయకుండా సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబానికి చేరే విధంగా కృషి చేయాలని హితవు పలికారు. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా జరిగే విధంగా గృహ నిర్మాణ అధికారులు గ్రామ కార్యదర్శులు పని చేయాలని సూచించారు. గ్రామీణ పారిశుద్ధ్య సమస్యలు, మిషన్ భగీరథ పనుల పురోగతి తదితర అంశాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి గ్రామ పంచాయతీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మిషన్ భగీరథ పథకం కింద గ్రామాలకు నీటి సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ప్రజలకు నీటి తాకిడి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో, డీఎల్పీఓ, ఎంసీపీడీఓ, (ఈఈ), ఎమ్మార్వోలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఏఈఈ), పంచాయతీ సెక్రటరీలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ప్రతి ఒక్క అధికారితో ప్రత్యేకంగా చర్చిస్తూ, నియోజకవర్గ అభివృద్ధిలో తమ పాత్రను బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు.