22-06-2025 12:00:00 AM
దేశంలోని అనేక హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసిన సందర్భాలు వున్నాయి. హైకోర్టు తీర్పులపై తమ ముందుకు వచ్చే పిటిషన్లను పరిశీలించినప్పుడు, ఆ తీర్పులు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడే ఉన్నాయా అనేది సరిచూడటం సుప్రీంకోర్టు వంతు. పౌరులకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు రాజ్యాంగం కల్పించింది. సకారణంగా ఆ భావవ్యక్తీకరణను మరొకరు అడ్డుకోనూ వచ్చు.
అయితే, భావవ్యక్తీకరణే తప్పు అని ఎవరైనా అంటే, అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ చిత్రం కర్ణాటకలో విడుదల కాకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తపరిచింది. కర్ణాటక హైకోర్టు, కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యపై క్షమాపణ అడగడాన్ని తప్పు పట్టింది. ‘థగ్ లైఫ్’ చిత్రం ప్రీరిలీజ్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని, తమిళ భాషకు కన్నడం ఒక సోదర భాష లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడిగులకు సహజంగానే ఆగ్రహం తెప్పించాయి. కమల్ హాసన్‌పై కన్నడిగుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా, కన్నడిగులు డిమాండ్ చేసినట్లుగా తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేందుకు కమల్ హాసన్ నిరాకరించారు.
తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన చెప్పారు. కమల్ హాసన్ చిత్రంపై నిషేధం విధించాలని కొన్ని కన్నడ సంస్థలు డిమాండ్ చేశాయి. ‘థగ్ లైఫ్’ చిత్రం కర్ణాటకలో విడుదల కాలేదు. ఆ రాష్ట్రంలో విడుదల చేయకూడదని కమల్ హాసన్ నిర్ణయించుకున్నారు. కర్ణాటక హైకోర్టుకు వెళ్లిన ఈ వివాదంలో, కమల్ హాసన్‌ను హైకోర్టు తప్పు పట్టింది. కమల్ వ్యాఖ్యలు కర్ణాటక ప్రజల మనోభావాలను గాయ పర్చాయని పేర్కొంది.
ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి కమల్ హాసన్ ఏమైనా చరిత్రకారులా? భాషావేత్తనా? అని హైకోర్టు ప్రశ్నించింది. కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి కమల్ హాసన్ ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించింది. ఈ విషయంపై కమల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు ఆయన భావవ్యక్తీకరణలో భాగమేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. హైకోర్టు ఆయనను క్షమాపణలు చెప్పాల్సిందిగా ఎలా అడుగుతుందని ప్రశ్నించింది.
‘థగ్ లైఫ్’ చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వాలని కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొన్ని గుంపులు వీథుల్లో న్యాయం చెపుతామంటే చెల్లదనీ పేర్కొంది. భావప్రకటన స్వేచ్ఛ విషయంలో పరస్పర విరుద్ధ భావనలపై చర్చ జరగాలే గానీ, ఎదుటివారి భావనలను ఏకపక్షంగా తప్పు అని చెప్పడం సరికాదు అని వ్యాఖ్యానించింది. ఒకరు చేసిన వ్యాఖ్యలు నచ్చక పోతే తిరిగి వంద వ్యాఖ్యానాలు చేయవచ్చు.
రాత పూర్వకంగా ఎవరైనా ఒక భావాన్ని వ్యక్తపరిస్తే, దానిని రాత పూర్వకంగానే ఖండించవచ్చునని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ఇక్కడ ఇతరుల మనోభావాలను దెబ్బ తీయడమనేది చర్చనీయాంశంగా మారింది. ఇతరుల మనోభావాలు దెబ్బ తింటాయని వ్యక్తులు తమ తమ భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోవాలా? ఇతరుల మనోభావాలను కించ పరిచే విధంగా తమ భావప్రకటన ఉండకుండా జాగ్రత్త పడటమొక్కటే దీనికి పరిష్కారం. ఈ విషయంలో రాజ్యాంగ స్ఫూర్తితో నడుచుకోవడం ఎలా అనేది న్యాయస్థానాలే స్పష్టత నివ్వాల్సి ఉంది.