calender_icon.png 15 September, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతిని మేల్కొల్పిన మహాజ్వాల!

22-06-2025 12:00:00 AM

రేపు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి :

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

జాన్ 23 స్వర్గీయ శామ్‌ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా, సంకల్పంతో సిద్ధి ఎలా సాధించగలమో వారి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. వారు జీవితం కాలం నమ్మిన, పోరాడిన సిద్ధాంతం ఒక దేశం లో, రెండు రాజ్యాంగాలు, రెండు జెండా లు, ఇద్దరు ప్రధానులు నడవదు, నడవదు అని పోరాడి, చివరకు తానూ నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్ని భారతమాతకు అర్పించిన జ్వాల స్వర్గీయ ముఖర్జీ. 

1901 జూలై 6న కలకత్తాలో జన్మించిన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ, భారత మేధోసంపదకు మహోన్నతంగా నిలిచిన సర్ అశుతోష్ ముఖర్జీ కుమారుడు. చిన్ననాటి నుంచే అసాధారణ మేధస్సు కలిగిన ఆయన ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా నుంచి ఇంగ్లీష్‌లో బీఏ, ఆ తర్వాత ఎంఏ, బీఎల్ పూర్తి చేశారు. కేవలం 23 ఏళ్ల వయసులో లండన్‌లోని లింకన్ ఇన్ నుంచి బారిస్టర్ అయ్యారు.- బ్రిటిష్ పాలనలో భారతీయుడిగా ఇదొక అరుదైన ఘనత.

కేవలం 33 ఏళ్ల వయసులో ఆయన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులయ్యారు (1934--1938). ఆయన పదవీ కాలంలో భారతీయ భాషలకు ప్రోత్సాహం అందించడమే కాక శాస్త్రీయ విద్యాభివృద్ధికి, మహిళా విద్య, విద్యతో జాతీయత చైతన్యాన్ని ప్రేరేపించడం వంటివాటికి కృషి చేశారు. విద్య అంటే కేవలం పాఠాలు కాదు అది దేశానికి ఆత్మను నూరిపోసే సాధనమని వారి నమ్మకం. దేశ విభజన రాజకీయాలను ఎదిరించిన జాతీయవాదిగా ఆయన చరిత్రలో నిలిచారు.

ప్రారంభంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌పట్ల మానసిక అనురక్తితో రాజకీయ జీవితం ప్రారంభించిన ముఖర్జీ, 1929లో బెంగాల్ శాసనమండలికి ఎన్నికయ్యారు. అయితే, కాంగ్రెస్ ముస్లిం లీగ్ కు అండగా వ్యవహరించడాన్ని చూసి ఆ యన అసహనం వ్యక్తం చేశారు. ఆ తరువాత 1943-1946 వరకు హిందూ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆయన ప్రయత్నం -హిందూ స్వాభిమానం పేరు తో విభజనకు వ్యతిరేకంగా జాతీయ ఐక్యతకు తన శక్తినంతా ధారపోశారు. ఒక రాజకీయ నాయకుడిగానే కాక సేవాభావనతో బెంగాల్ కరువు (1943) సమ యంలో ఆయన ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తు న సహాయక చర్యలు చేపట్టారు. బ్రిటిష్ పాలనలోని నిర్లక్ష్యాన్ని విమర్శించారు.

ఒక దేశం, రెండు భిన్నాభిప్రాయాలు:

1947 ఆగస్టు 15న భారత స్వాతంత్య్రం అనంతరం నెహ్రూ తొలి కేబినెట్‌లో పరిశ్రమలు, సరఫరా శాఖ మంత్రిగా నియమితులైన ముఖర్జీ, త్వరలోనే ఆలోచనాత్మక విభేదాలకు గురయ్యారు. నెహ్రూ విధానాలు దేశాన్ని బలహీన పరచడమే కాక మున్ముందు దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించారు. ధార్మిక, జాతీయ, భారత భవిషత్తు అంశాలపై ఆయన నెహ్రూతో విభేదించారు.

నెహ్రూతో ప్రధాన విభేదాలు:

భారత విభజన: మత పునాది మీద దేశాన్ని చీల్చడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

కశ్మీర్: ఆర్టికల్ 370ను వ్యతిరేకిస్తూ, ఇది దేశాన్ని చీల్చుతుందని హెచ్చరించారు.

అల్పసంఖ్యాక వర్గాల తీరుపై విమర్శలు- పాకిస్థాన్‌పై నెహ్రూ అనుకూల వైఖరిపట్ల ధ్వజమెత్తారు.

నెహ్రూ- లియాకత్ ఒప్పందం (1950): తూర్పు పాకిస్థాన్‌లో హిందువుల హక్కులను (బంగ్లాదేశ్) నిర్లక్ష్యం చేయడమని విమర్శించారు. 1950 ఏప్రిల్‌లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇలా ప్రకటించారు: “దేశాన్ని బలహీన పరిచే విధానాల్లో భాగస్వామిగా ఉండలేను”

జనసంఘ్ ఓ ఆశాదీపం:

దేశభక్తి, జాతీయవాదం, భారత మూలధర్మం ఆధారంగా భారత్‌ను నిర్మించే దిశగా, భారతీయ జనసంఘ్ స్థాపిత మైంది. అదే స్ఫూర్తితో ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించి ‘భారతీయ జనతా పార్టీ’. అది 1951లో ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో ప్రారంభించడం జరిగింది.

ఆయన ధ్యేయం:

* ఒక దేశం- ఒక రాజ్యాంగం- ఒక జెండా.

* సాంస్కృతిక జాతీయత.

* ఆర్థిక స్వేచ్ఛకుతోడు దేశ భద్రత.

* ప్రత్యేక హోదా అనే భావనను తిరస్కరించడం.

ధర్మరాజ్యానికి న్యాయమేధావి:

ఆయన రాజ్యాంగ రచనా కమిటీ సభ్యుడు కాకపోయినా పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలు ఆలోచనాత్మకంగా, దూరదృష్టితో ఉండేవి.

ఆయన హెచ్చరించిన విషయాలు:

* ఆర్టికల్ 370వల్ల దేశ విభజన ప్రమాదం

* సెక్యులరిజం పేరిట ఓటుబ్యాంకు రాజకీయాలు

* అత్యధిక రాష్ట్రాల ఆర్థిక నియంత్రణ సరికాదు. ఆయన సూచించింది ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం, వికేంద్రీకరణతో కూడిన ఐక్యత. కశ్మీర్‌లో బలిదానం ఇప్పటికీ అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు.

సమైక్యత కోసం.. 

శ్యాంప్రసాద్ ముఖర్జీ తుదిశ్వాస  విడి చే వరకూ దేశం కోసం తపించిన త్యాగజీవి. అప్పట్లో నెహ్రూ తెచ్చిన ఆర్టికల్ 370 కారణంగా భారతీయులు కాశ్మీర్‌కు వెళ్లాలంటే పర్మిట్ (వీసాలాగా) తీసుకోవాలి. కానీ, దేశభక్తి, దేశ ఐక్యతకు కట్టుబ డిన ముఖర్జీ పర్మిట్ అనే పదాన్ని వ్యతిరేకిస్తూ ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసీ’ (జన్మనిచ్చిన తల్లి, మాతృ దేశం స్వర్గానికంటే గొప్పవి) అనే స్పూర్తితో 1953లోనే ఆర్టికల్ 370ను వ్యతిరేకించారు.

కశ్మీర్‌లో అనుమతి లేకుండా ప్రవేశించేందుకు కశ్మీర్ సత్యాగ్రహం చేపట్టారు. కానీ దేశానికి ఐక్యతాదీపంగా ఎదుగుతున్న ముఖర్జీని షేక్ అబ్దుల్లా ప్రభుత్వం మే 11న అరెస్ట్ చేసి, నిశాత్ గార్డెన్‌లో (శ్రీనగర్) నిర్బంధంలో ఉంచింది. 1953 జూన్ 23న సందేహాస్పద పరిస్థితుల్లో నిర్బంధంలోనే వారు మృతి చెం దారు. కేవలం 51 సంవత్సరాలకే ఆయన తన ప్రాణాన్ని భారత ప్రజల ఐక్యత కోసం అర్పించారు. వారి మరణానికి కారణంపైన విచారణ జరపాలని అయన తల్లి నెహ్రూని వేడుకున్నా మౌనమే సమాధానమైంది.

ముఖర్జీ ఆర్టికల్ 370 రద్దు అనే సంకల్పాన్ని, సరిగ్గా 66 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ 2019లో రద్దు చేశారు. తద్వారా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు నిజమైన నివాళులు అర్పించినట్టయ్యింది. వారి జీవితాశయ సాధనకు ఇదొక స్ఫూర్తి. ప్రధానంగా

* 2019లో ఆర్టికల్ 370 రద్దు ఆయన స్వప్నానికి న్యాయం.

* సాంస్కృతిక జాతీయత అనే భావనకు శ్రీకారం.

వామనుడిగా మొదలైన బీజేపీ ఇంతింతై వటుడింతయై ఈరోజు ప్రపంచంలో అత్యంత పెద్ద రాజకీయ పార్టీగా అవతరించటానికి ముఖర్జీ బలిదానం బలమైన స్ఫూర్తి అయ్యింది. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కేవలం రాజకీయ నాయకుడు కాదు, ఒక మహా దేశభక్తుడు, శాస్త్రవేత్త, విద్యావేత్త, సంస్థాపకుడు, చివరికి జాతీయ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన వీరుడు. 

జీవితం న తు కాలతః, 

కర్మణా ఏవ శోభతే!

అంటే మనం ఎన్ని రోజులు జీవించామన్నది కాదు, ఎలా జీవించామనేదే ముఖ్యం.

వ్యాసకర్త మాజీ ఎంపీ, -బోనగిరి