calender_icon.png 3 November, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పవర్’ లేని పదవులేల.. అమాత్య యోగమెప్పుడో?

03-11-2025 02:01:12 AM

  1. సామాజిక సమీకరణాలే అడ్డంకి 
  2. ‘సలహా’ పదవులతో సరి 
  3. ఐదు కార్పొరేషన్ల చైర్మన్లు దక్కినా అసంతృప్తియే 
  4. క్యాబినెట్లో స్థానంలేక ఆవేదన 
  5. పరిపాలనపై సడలుతున్న పట్టు 
  6. వ్యవసాయ జిల్లాకు మంత్రి లేకపోవడంపై  చర్చ 
  7. ఆశల్లో జూనియర్ ఎమ్మెల్యేలు.. 
  8. షబ్బీర్ అలీ ఆశలకు గండి! 
  9. కార్యకర్తల్లో నిరుత్సాహం

నిజామాబాద్, నవంబర్02 (విజయ క్రాంతి): రాష్ర్టం తో పాటు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు అధికారం కట్టబెట్టినప్పటికీని  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు మాత్రం   మంత్రి పదవి దక్కలేదు, కనీస ‘అమాత్య’ ప్రాధాన్యానికి నోచుకోకుండా నిజామాబాద్ జిల్లా నిలబడిపోయింది. పార్టీకి కంచుకోట లా నిలిచిన జిల్లాకు, కీలక సమయంలో అండగా ఉన్న నేతలకు “పదవులు” దక్కాయి కానీ, జిల్లా అభివృద్ధికి అత్యంత కీలకమైన “పవర్‌” (క్యాబినెట్ మంత్రి) మాత్రం దక్కలేదు.

ఐదు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఏకంగా టీపీసీసీ అధ్యక్ష పీఠం, ముగ్గురు సలహాదారులు (ఒకరికి క్యాబినెట్ హోదా) ఉన్నా.. పాలనపై ప్రత్యక్ష పట్టు సాధించే మంత్రి పదవి లేకపోవడం, జిల్లా రాజకీయ వర్గాల్లో మరియు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి కి, నిరాశకు కారణమవుతోంది.

 సమీకరణాల ‘కోత’కు సీనియర్ బలి! 

మంత్రి పదవి రేసులో జిల్లా నుంచి అందరికంటే ముందున్న పేరు మాజీ మంత్రి పి. సుదర్శన్ రెడ్డిది. నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ర్టంలోనే భారీ నీటిపారుదల, వైద్య విద్య వంటి కీలక శాఖలు నిర్వహించిన అపార అనుభవం, నిజామాబాద్ కు మెడికల్ కళాశాల, ఆసుపత్రి భవనం వంటి ‘మానస పుత్రిక లను’ అందించిన చరిత్ర ఆయనది. అన్నిటికీ మించి, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జెండా వీడకుండా, కోశాధికారిగా పార్టీకి ఆర్ధిక వనరులు సమకూర్చిన విధేయత ఆయన సొంతం.

అయితే, ఇన్ని అరతలు “సామాజిక సమీకరణాలు” అనే రాజకీయ చదరంగంలో బలాదూర్ అయ్యాయి. ఆయన అనుభవాన్ని, విధేయతను పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం ‘సలహాదారు’ పదవి ఇచ్చి అధిష్టానం చేతులు దులుపు కుందన్నది ఆయన వర్గీయుల ప్రధాన ఆవేదన. ఇది కేవలం సుదర్శన్ రెడ్డికి జరిగిన అన్యాయం మాత్రమే కాదు, జిల్లాకు దక్కాల్సిన పాలనాపరమైన అవకాశానికి గండి కొట్టడమే నని విశ్లేషకులు భావిస్తున్నారు.

 పదవులు ఉన్నా.. పట్టు ఎక్కడ? 

జిల్లాకు మంత్రి పదవి లేకపోయినా, కీలక పదవులు మాత్రం లభించాయి. టీపీసీసీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, క్యాబినెట్ హోదా సలహాదారుగా షబ్బీర్ అలీ, మరో సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, ఐదుగురు కార్పొరేషన్ చైర్మన్లు (బాలరాజు, మోహన్ రెడ్డి, తాహెర్, అన్వేష్ రెడ్డి, అనిల్) ఉన్నారు. కాగితంపై ఇవన్నీ బలంగా కనిపించినా, వాస్తవ క్షేత్రస్థాయిలో ఇవేవీ ఒక క్యాబినెట్ మంత్రి చేయగల పనిని భర్తీ చేయలేవు. ఒక మంత్రికి ఉండే కార్యనిర్వహణ అధికారం, బడ్జెట్ కేటాయింపులపై పట్టు, అధికారులను నడిపించే సత్తా.. ఈ నామినేటెడ్ పదవులకు ఉండదు. ఫలితంగా, జిల్లాలో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా, పరిపాలనపై ఏకీకృత పట్టు కొరవడి, “ఎవరికివారే అధికారం” అన్నట్లుగా పరిస్థితి తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆశావహుల నిరీక్షణ.. జిల్లాకు నష్టం 

మరోవైపు, తొలిసారి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు సమీప భవిష్యత్తులో నెరవేరేలా కనిపించడం లేదు. తాజాగా హైదరాబాద్ కు చెందిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో, కామారెడ్డి త్యాగం పేరిట మంత్రి పదవి ఆశించిన షబ్బీర్ అలీ ఆశలకు కూడా దాదాపు గండి పడినట్లే. వ్యవసాయ ప్రధానమైన, నిజాంసాగర్ ప్రాజెక్టుపై ఆధారపడిన ఉమ్మడి జిల్లాకు..

నీటిపారుదల, వ్యవసాయ సమస్యలపై క్యాబినెట్ లో బలంగా గొంతు వినిపించే ‘మంత్రి’ లేకపోవడం పెద్ద లోటు. జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా సీతక్క ఉన్నా, ఆమె సొంత జిల్లా వ్యవహారాలు చూసుకోవడాని కే సరిపోతుంది. ఇప్పటికైనా అధిష్టానం పునరాలో చించి, జిల్లాకు క్యాబినెట్ లో స్థానం కల్పించకపోతే, ఈ ‘అమాత్య’ నిరీక్షణ.. పార్టీకి, జిల్లా అభివృద్ధికి దీర్ఘకాలిక నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది.