03-11-2025 02:00:53 AM
వీటితోనే ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకు యత్నం
అయినా.. జూబ్లీహిల్స్ ప్రజల చూపు.. బీజేపీ వైపు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్లు, కమీషన్లపైనే ఆధారపడి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందదర్‌రావు ఆరోపించారు. ఎలాగైనా గెలవా లనే ఉద్దేశంతో బెదిరింపు ధోరణితో పాటు ఆ పార్టీ మత రాజకీయాలు కూడా చేస్తోందని ఆయన ఘాటుగా విమర్శించారు. అయినా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నా రని, ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు రాంచందర్‌రావు తెలిపారు.
వనపర్తి జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు వెంకటపాటి రాజన్న, నాగేశ్వర్‌రావు, నర్సింగ్ రావు, శివకుమార్ తదితరులు ఆదివారం రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్ అవినీతి పాలనతో తీవ్ర అసంతృప్తి పరిచిందని, ప్రజలు ఆ పార్టీని కూడా నమ్మేస్థితిలో లేరని పేర్కొన్నారు. యువకులు, మహిళలు, విద్యావంతులు బీజేపీలో చేరి తెలంగాణ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్‌కు మోదీనే కారణం
వికసిత్ భారత్‌గా, ఆత్మనిర్భర భారత్‌గా దూసుకుపోతుందంటే అందుకు మోదీయే కారణమన్నారు. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వ సారథ్యంలో దేశం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నరేంద్ర మోదీ పాలన, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని, ఈ చేరికల ద్వారా తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నట్టు మరొసారి స్పష్టమవుతున్నదని ఆయన చెప్పారు. బీజేపీ నాయకత్వం పుష్కరకాలంగా అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో కూడా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.