calender_icon.png 18 July, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పుడేం చేయమంటావ్?

18-07-2025 12:00:00 AM

  1. నెలనెలా మామూళ్ళు ఇస్తున్నాం డిఎంహెచ్వో కే కాదు.. కలెక్టర్ కూ ఫిర్యాదు చేసుకో..
  2. పేషంట్లను బెదిరిస్తున్న ’ సంకల్ప’ దవాఖాన నిర్వాహకులు
  3. డయాగ్నొస్టిక్ కేంద్రాలతో కుమ్మక్కై రోగులకు బురిడీ 
  4. ఫేక్ రిపోర్టులతో ఏకంగా శస్త్రచికిత్స లకు ఏర్పాట్లు 
  5. నల్లగొండలో ప్రైవేటు హాస్పిటల్ నయా దందా!

నల్లగొండ నేర విభాగం, జూలై 17(విజయక్రాంతి): అది నల్లగొండ జిల్లా కేంద్రంలోని సంకల్ప ప్రైవేటు ఆస్పత్రి. అక్కడికి వైద్యం కోసం వస్తే.. లేనిపోని రోగాల పేరు చెప్పి రూ.లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే.. ఇప్పుడు ఏంజేయమంటవ్.. తప్పు జరిగింది..? అయితే ఏంది..? ఎవరికీ ఫిర్యాదు చేసుకుంటావో చేసుకో.. మేం ప్రతినెలా కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు మాముళ్లు ఇస్తున్నాం.. డీఎంహెచ్‌ఓకు కాకుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోండంటూ పేషంట్లపైనే దాదాగిరికి దిగడం సంకల్ప ఆస్పత్రి యాజమాన్యానికి పెట్టింది పేరుగా మారింది.

నిజానికి ప్రకాశం బజారులోని ఓ ఇరుకైన బిల్డింగ్లో ఆస్పత్రిని నిర్వహిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నిత్యం రూ.లక్షలు పేషంట్ల నుంచి వసూలు చేస్తున్నారు. అయితే ఇటీవల సదరు ఆస్పత్రిలో ఓ దారుణం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన కసర్ల కనకమహాలక్ష్మీ అనే మహిళ ఇటీవల సంకల్ప ఆస్పత్రిలో డెలీవరీ అయ్యింది.

10 రోజులు కంప్లీట్ కాకముందే తీవ్రనొప్పితో మళ్లీ సంకల్ప ఆస్ప్రతిని సంప్రదించింది. అయితే ఆ ఆస్పత్రిలోని గైనిక్ డాక్టర్ నల్లగొండ జిల్లా కేంద్రంలోని డయాగ్నస్టిక్ సెంటరుకు రిఫర్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు వ్యవహారం ఇక్కడే మొదలయ్యింది. 

అత్యవసర ఆపరేషన్ అంటూ రూ.లక్ష డిమాండ్..

సదరు పేషంట్ కనక మహాలక్ష్మీ 2025 జూలై 11న నల్గొండలోని రివర్ డయాగ్నస్టిక్ సెంటర్ వద్ద డా. అఫ్రోజ్ (ఎండీఆర్డీ  కన్సల్టెంట్ రేడియాలజిస్ట్) చేసిన అబ్డోమినల్ అల్ట్రాసౌండ్ నివేదికలో వెసికల్ కాల్క్యులస్ (మూత్రాశయంలో రాయి) ఉందని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా బాధితురాలు నల్గొండలోని సంకల్పా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద డాక్టర్లు డా. పి. శ్రావణి (ఓబీజీ) డాక్టర్ రఘునందన్ (సర్జన్) ను సంప్రదించారు.

వైద్యులు పరీక్షించిన అనంతరం, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆమెకు ‘శస్త్రచికిత్స తక్షణమే చేయాలి, లేకపోతే మూత్రపిండాలు, మూత్రాశయానికి నష్టం జరుగుతుంది‘ అని చెప్పినట్లు ఆరోపించారు. పైగా, ఈ చికిత్సకి రూ.లక్షకు పైగా ఖర్చవుతుందని హాస్పిటల్ మేనేజ్మెంట్ తేల్చి చెప్పినట్లు బాధితురాలు పేర్కొన్నారు.

దీంతో అనుమానం వచ్చిన సదరు పేషంట్ ఓవైపు తీవ్ర నొప్పి భరిస్తూనే 2025 జూలై 12న హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్కి వెళ్లి మళ్లీ పరీక్షలు చేయించుకున్నారు. అక్కడి వైద్యులు నిర్వహించిన తాజా అల్ట్రాసౌండ్ నివేదికలో ఎటువంటి రాయి లేకపోవడం, శస్త్రచికిత్స అవసరం లేదని స్పష్టం చేయడంతో ఆమెకు ఈ మొత్తం వ్యవహారం తప్పుడు నిర్ధారణ, అనవసర వైద్య భయపెట్టు చర్యగా అనిపించిందని వివరించారు.

రూ.30వేలకు డీల్ కుదిర్చే ప్రయత్నం..

ఈ వ్యవహారంపై కనక మహాలక్ష్మీ కుటుంబ సభ్యులు సంకల్ప ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీయగా, ఏదో తప్పు జరిగిందని సదరు డయాగ్నస్టిక్ సెంటరుతో మాట్లాడి రూ.30 వేలు చెల్లించే విధంగా డీల్ కుదిర్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  కానీ పేషంట్ మహాలక్ష్మీ కుటుంబ సభ్యులు డబ్బులు మాకు అవసరం లేదని, ఇలా ఎంతమంది పేషంట్లను మోసం చేస్తారని యాజమాన్యాన్ని నిలదీశారు.

ఇదిలావుంటే.. అసలు పూర్తిస్థాయిలో వ్యాధి నిర్ధారణ కాకుండానే సంకల్ప ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ రఘునందన్ ఏలా అవసరం అవసరం అని పేషంట్తో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేశారనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివరణ కోరే ప్రయత్నం చేయగా, రివర్ డయాగ్నస్టిక్ సెంటర్ తప్పంటూ సంకల్ప ఆస్పత్రి యాజమాన్యం.. కాదు సంకల్ప ఆస్పత్రిదే తప్పంటూ రివర్ డయాగ్నస్టిక్ సెంటర్ యాజమాన్యం చెబుతుండడం కొసమెరుపు.

డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేసినా చర్యలేవీ..

సదరు పేషంట్ కనక మహాలక్ష్మీ ఇదే విషయంపై డీఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. రివర్ డయాగ్నస్టిక్ సెంటర్ ఇచ్చిన తప్పుడు నివేదికతో పాటు సంకల్ప హాస్పిటల్ వైద్యులు, మేనేజ్మెంట్ అందించిన అనవసర చికిత్స సూచనలు అనైతికమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు నిర్ధారణ కారణంగా తాను అనుభవించిన మానసిక వేదన, ఆర్థిక భయం, ఆరోగ్యపరమైన ప్రమాదంపై ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత డయాగ్నస్టిక్ సెంటరుతో పాటు సంకల్ప యాజమాన్యంపై తగిన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పేషంట్ తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చర్య తీసుకుంటారా..? లేదో వేచి చూడాలి.