calender_icon.png 25 May, 2025 | 1:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూలో స్థూపం ఏది?

25-05-2025 12:00:00 AM

కేసీఆర్‌కు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే.. తన అవసరాలకు అనుగుణంగా రాజకీయాలను  నడపడం, ఆపేయడం. ఓయూ విద్యార్థులుగా ఉద్యమ సమయంలో మేం ఊహించినట్టుగానే.. ఉద్యమం తారస్థాయిలో ఉన్నప్పుడు కేసీఆర్ నిమ్మరసం తాగి ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. కేసీఆర్ ఎప్పుడు తన మాట మీద 24 గంటలు కూడా నిలబడలేదనేది చరిత్ర నిరూపించిందంటున్నారు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి జంజర్ల రమేశ్‌బాబు. తన ఉద్యమానుభవాలను ‘విజయక్రాంతి’తో నెమరువేసుకున్నారు.

మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతం. నాన్న సింగరేణి ఉద్యోగి. నా విద్యాభాస్యం మొత్తం సర్కారు బడుల్లోనే కొనసాగించా. బాగా చదువుకొని, ఒక మంచి ఉద్యోగం సాధించాలనే ఆలోచన చిన్ననాటి నుంచే ఉండేది. కానీ, వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నప్పుడు నా ఆలోచన విధానం మారింది. ఒకరి కింద పనిచేయకుండా సొంతంగా వ్యాపారం చేయాలి.. పదిమందికి ఉద్యోగం కల్పించాలనే లక్ష్యం ఉండేది.

పాలిటెక్నిక్ పూర్తి కాగానే ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ రాశా.. ఓయూలో సీటు వచ్చింది. లైఫ్‌లో సెటిల్ కావడానికి ఉన్నమార్గాలన్నీ వెతికా. రకరకాల ఉద్యోగాలు, బిజినెస్‌లు చేస్తున్న సమయంలోనే రైల్వే.. ఏరోనాటికల్ డిపార్ట్‌మెంట్‌లో ఒకేసారి రెండు ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగానికి అర్హత ఉన్నా డబ్బులు లేని స్థితి. అక్కడ కూడా అవినీతి రాజకీయాలే. ఈ ప్రభావాలన్నీ సమాజం పట్ల నాకు ఒక అవగాహనను కలిగించాయి.

అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. రాజకీయ అధికారం అనేది ప్రాంతేతర వ్యక్తుల చేతుల్లో ఉండటంతోనే తెలంగాణలో అనుకున్న ఉద్యోగాలు లేకపోవడం.. అభివృద్ధి చెందకపోవడం. వెనుకబాటు తనం.. ఇవన్నీ అర్థం అవ్వడం మొదలైంది. నాకున్న అనుభవం కూడా అలాంటిదే కాబట్టి ఉద్యమం వైపు వచ్చా.

తెలంగాణ జాగరణ సేన

2001లో టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఆంధ్ర పాలనకు వ్యతిరేకంగా, స్వపాలన అవసరాన్ని గుర్తించి ఉద్యమంలో భాగమయ్యా. టీఆర్‌ఎస్‌ని మొదటి తరం నడిపినవారిలో నేను ఒకణ్ణి. మణుగూరులో టీఆర్‌ఎస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించా. వరంగల్ జైత్రయాత్రకు మణుగూరు నుంచి 150 మందిమి క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చాం.

తెలంగాణకు ఒక ఆర్మీ లాంటిది ఉండాలని కేసీఆర్ అప్పట్లో తెలంగాణజాగరణ సేనను ఏర్పాటు చేశారు. మణుగూరు నుంచి నేను హైదరాబాద్‌లోని నోమా ఫంక్షన్ హాల్లో జరిగిన మూడు రోజుల శిక్షణకు వచ్చా. అక్కడే మొదటిసారి ప్రొ.జయశంకర్ సార్‌ను, ప్రొ.కోదండరాం, దేశపతి శ్రీనివాస్, కవి నందిని సిధారెడ్డిని చూశా. ఆ మూడురోజులు విస్తృతమైనన చర్చలు జరిగాయి. 

రాజకీయ అవసరాల కోసమే! 

2005 తర్వాత కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసమే తెలంగాణ ఉద్యమాన్ని వాడుకుంటున్నారు అనేది అందరికీ అర్థమైంది. ఆ సమయంలోనే కేసీఆర్ ఒక నిర్మాణాన్ని ఎప్పుడూ చేయలేదు. ఆ పార్టీ ఈ రోజుకు కూడా పైస్థాయి నాయకుడు చెప్తే చేసుడే తప్ప.. ఒక ఉద్యమాన్ని స్వతంత్రంగా నడిపించే పరిస్థితి లేదు. కేసీఆర్ అనుకున్నప్పుడే ఉద్యమం నడుస్తుంది. మనం ఉద్యమం కోసం కదులుతున్నప్పుడు..

స్విచ్ వేస్తే లైట్ వెలిగినట్టు మనస్తత్వాలు ఉండవు. విద్యార్థులందరినీ రోడ్డు మీదకు తీసుకొచ్చి.. ఉద్యమం చేయమని చెప్పి.. తారస్థాయికి పోయినంక మీరు ఆగండి.. వెనక్కిరండని.. చెబితే.. మన మాట ఎవరూ వినరు. తిరగబడతారు. మమ్మల్ని రెచ్చగొట్టి.. వెనక్కి రమ్మంటే.. నీ ప్రయోజనాలు ఏంటని అడుగుతారు? ఎందుకంటే 1969 నుంచి నాయకులు మోసం చేసిన చరిత్ర తెలంగాణకు ఉండటం.

కాబట్టి ఉద్యమాన్ని ఆపామంటే మనల్ని అనుమానిస్తారు. మనల్ని అనుమానిస్తే.. ప్రజలు మనతో నడవరు. ఇలాంటి ఆన్, ఆఫ్ లాంటి ఉద్యమాలు మనం నడపలేమనుకున్నప్పుడు.. జగన్, కాశీం, దరువు ఎల్లన్న లాంటి వాళ్లందరూ 20 మందిమి కలిసి తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) ఏర్పాటు చేశాం.  

ఆ మరణాలు కలచివేశాయి!

తెలంగాణ వస్తదా? రాదా? అనే గందరగోళం నాడు ఉండేది. రాజకీయపార్టీల దోబూచులాట.. రకరకాలుగా తెలంగాణ సమాజాన్ని కల్లోల పర్చిన సందర్భం. రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరి.. విద్యార్థులను కలచివేసింది.

ఓయూలో 11, 12 సంఘాలు గట్టిగా నిర్ణయం తీసుకుని.. తెలంగాణ కోసమే ఒక విద్యార్థి ఉద్యమం నడిపించాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుచేశాం. అదే సమయంలో వేణుగోపాల్‌రెడ్డి మరణం తెలంగాణ కోసం ఒక కొత్త తోవను చూపింది. ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకురావడానికి కారణమైంది. 

యాదయ్య మరణం..

వేణుగోపాల్ రెడ్డి మరణం అనేది విద్యార్థి ఉద్యమ చరిత్రలో అదొక గొప్ప మలుపు. వేణుగోపాల్ రెడ్డి మరణానికి ముందు రోజు ఆర్ట్స్ కాలేజీ చుట్టూ తిరగడం.. ఉద్యమంలో పాల్గొనడం.. ఆ రోజు రాత్రి అక్కడే ఓయూ కాలేజీలోనే తిరగడం.. అందరం చూశాం. కానీ, ఆ మరణానికి గల కారణాలు ఇప్పటికీ తెలియదు. రాత్రంతా తిరిగిన వ్యక్తి.. తెల్లారే సరికి అతని మరణవార్త విద్యార్థులను బాగా కలచివేసింది.

సిరిపురం యాదయ్య మరణం బాధకరం. యాదయ్య ఒక అనాథగా జీవితాన్ని గడుపుతున్నవాడు. అయితే తెలంగాణ ఉద్యమం చెబుతున్న మాటలు నమ్మి రాజకీయ నాయకుల హామీలపై నమ్మకం పెట్టుకున్నాడు. తెలంగాణ వస్తే ఆత్మగౌవరం పెరుగుతుంది. మనల్ని మనం పరిపాలించుకుంటాం.

ఇంతకన్నా గొప్ప భవిష్యత్ ఉంటుంది అని అనుకున్నాడు. తెలంగాణ అనేది తన జీవితంలో ఒక గొప్ప మార్పుకు కారణం అవుతుందని యాదయ్య బలంగా విశ్వాసించాడు. ఆ విశ్వాసమే మానసికంగా బాగా కుమిలిపోయేలా చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

కిందికులాల వారే అధికం..

తెలంగాణ వస్తే తమ బతుకులు మారుతాయని కింది కులాలకు చెందినవారు అద్భుతమైన భవిష్యత్‌ను కలగన్నారు. ఆ కలలకు వర్తమానానికి మధ్య ఉన్న దూరం తీవ్రంగా కలిచివేసింది. నాకు తెలిసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లంత కూడా ఎక్కువగా ఇంట్రోవర్స్.

ఢిల్లీలో యాదిరెడ్డి, శ్రీకాంతాచారి వంటి వాళ్లే ఎక్కువగా ఫీల్ అయ్యారు. తెలంగాణ రాదేమో అనే ఆలోచన వాళ్ల జీవితాల్ని కలచివేయడం.. మానసిక ఆందోళనను తట్టుకోలేని వాళ్లంతా మరణాలకు ఒక పోరాట రూపం తీసుకొచ్చారు. 

నా డిమాండ్స్ ఇవే!

ఓయూలో విద్యార్థి అమరుల స్మారక స్థూపం ఏర్పాటు చేయాలి. ఉద్యమంలో అమరులై, గత ప్రభుత్వ గుర్తింపునకు, సహాయానికి నోచుకోని వారిని ఇప్పటికైనా గుర్తించి న్యాయం చేయాలి. ఉద్యమంలో జైలుకు వెళ్లిన విద్యార్థి ఉద్యమకారులకు డబుల్ బెడ్రూం ఇల్లు, 250 గజాల స్థలంలో నిర్మించి ఇవ్వాలి. ఉద్యమ సమయంలో అన్యాయంగా ఉద్యమకారులపై మోపిన అన్ని కేసులను రద్దు చేయాలి.

తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఒక బోధనాంశంగా చేర్చాలి. ఉద్యోగ నియామకాల్లో విద్యార్థి ఉద్యమకారులకు రిజర్వేషన్ ప్రకారం వెయిటేజ్ కల్పించాలి. తెలంగాణ రాష్ట్ర పోరాటయోధులుగా గుర్తింపు పత్రాలను అందజేయాలి.