- వయనాడ్‌లో హృదయ విదారక దృశ్యాలు
- అయినవారు కనిపించక అరణ్య రోదనలు
- ఆప్తుల ఆచూకీ కోసం బురదలో దేవులాట
- 200 దాటిన మృతులు
- ప్రకృతి విపత్తుపై ఊపందుకొన్న రాజకీయం
తిరువనంతపురం, జూలై 31: తమ బిడ్డలేమయ్యారోనని ఓ తల్లి ఉరుకులు పరుగుల.. తన కుటుంబ సభ్యులెవరైనా కనిపించారా? అని కనిపించినవారినల్లా అడుతూ రోదిస్తున్న ఓ వ్యక్తి. గొంతులోతు బురదలో చిక్కుకొని ఎవరైనా కాపాడుతారేమోనని ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు. బండరాళ్ల కింద ఎవరైనా బతికి ఉన్నారేమోనని దేవులాడుతున్న సహాయ సిబ్బంది. మావాళ్ల ఆచూకీ ఏమైనీ దొరికిందా అని హెల్‌లైన్‌కు క్యూ కడుతున్న బాధితులు.. వయనాడ్ ప్రకృతి విపత్తులో కనిపిస్తున్న హృదయ విదారక దృష్యాలివి.
కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ఆ ప్రాంతంలో తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు అధికంగా ఉండటంతో ఎంతమంది కనిపించకుండా పోయారనే లెక్క తేలటంలేదు. బుధవారం రాత్రి వరకు మృతుల సంఖ్య ౨౦౦ దాటిందని అధికారులు తెలిపారు. బాధితులకు సహాయం చేసేందుకు ఒకవైపు ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు భారీగా విరాళాలు అందిస్తుండగా, మరోవైపు ఈ పాపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ రాజకీయ పార్టీలు ఆరోపలు గుప్పించుకొంటున్నాయి.
అంతకంతకూ పెరుగుతున్న మృతులు
పశ్చిమ కనుమల్లోని నాలుగు గ్రామాలపై మంగళవారం రాత్రి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటం, అదే సమయంలో భారీ వర్షాలకు వరద పోటెత్తి బురద ప్రవాహంలా మారి గ్రామాలపై పడటంతో మహా విపత్తు సంభవించింది. పెద్దపెద్ద భవనాలు, భారీ వృక్షాలు సైతం నామరూపాల్లేకుండా పోయాయి. మీటర్ల మందం మట్టి, రాళ్లు, బురద పేరుకుపోవటంతో ఎంతమంది మరణించారో తెలియటం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 167 మృతదేహాలతోపాటు ౬౦కిపైగా శరీర భాగాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. 180 మంది వరకు మట్టి, రాళ్లకింద కప్పబడిపోయి ఉండవచ్చని తెలిపింది.
పర్వతం మొత్తం ఊడిపడిందనుకొన్నాం
ఈ ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ బాధితులు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. ప్రమద సమయంలో తమకు ఎదురైన అనుభవాలను తలుచుకొని వణికిపోతున్నారు. ‘పర్వతం మొత్తమే మాపై ఊడిపడుతుందని భయపడ్డాం. ఆ సమయంలో మేం మృత్యువుతో పోరాడాం’ అని జయేశ్ అనే బాధితుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ‘మంగళవారం రాత్రి 1.30 సమయంలో భారీ శబ్దం రావటంతో నిద్రనుంచి మేలుకొన్నాను. బయటకు చూస్తే మా ఇంటి ఎదురుగా ఉన్న ఇండ్లు పేక మేడల్లా కూలిపోవటం కనిపించింది.
తప్పించుకొనే సమయమే లేకపోయింది. అతికష్టం మీద నేను ఇంటినుంచి బయటకు పరుగెత్తాను. మా ఇంటిపక్కన ఉన్న నాలుగైదు ఇండ్లవాళ్లను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతానికి పరుగులు పెట్టాం. కానీ అప్పటికే చుట్టూ బురద చేరింది. ఎంతోమంది అందులో చిక్కుకుపోయారు. నా భార్య కుటుంబంలోని 9 మంది కనిపించకుండా పోయారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మూడో కొండచరియ తెల్లవారుజామున 5.30కు విరిగిపడింది. నా డాక్యుమెంట్లన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు. మేం ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడ ఉండాలి?’ అని విలపించాడు.
కేరళ సర్కారుదే నేరం
వయనాడ్ ప్రమాదంపై రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు మోపుకొనే పని మొదలుపెట్టాయి. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నదని కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని వారం క్రితమే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో బుధవారం తెలిపారు. అమిత్ షా విమర్శలను పినరాయి విజయన్ తిప్పికొట్టారు. నేరాన్ని ఇతరులపై నెట్టే చర్యలను మానుకోవాలని చురకలంటించారు. ‘వాతావరణ మార్పుల ప్రభావం చాలా తీవ్రంగా ఉందని కేంద్ర ప్రభుత్వం అర్థంచేసుకోవాలి.
గతంలో ఇంతకంటే తీవ్రమైన వర్షపాతాన్ని చూడలేదా? ఇప్పుడు కావాల్సింది వాతావరణ మార్పుల ప్రభావంతో సంభవిస్తున్న ఘటనలను నిరోధించటం. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఇతరులను నిందించే పని చేయకూడదు. బాధ్యతల నుంచి తప్పుకోకూడదు’ అని హితవు పలికారు. వయనాడ్ ప్రాంతంలో 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని కేంద్రం తెలిపిందని, కానీ ఆ తర్వాత 48 గంటల్లో ఏకంగా 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.
విరాళాల వెలువ
వయనాడ్ బాధితులను ఆదుకొనేందుకు ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ రూ.5 కోట్ల సాయం ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన కన్నడిగుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. తమిళనాడు ప్రభుత్వంతోపాటు తమిళ నటుడు చియాన్ విక్రం కూడా కేరళ ప్రభుత్వానికి ఆర్థిక సాయం ప్రకటించారు.
ప్రమాదంపై ఎవరూ హెచ్చరించలేదు
రెండుమూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నా కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నదని తమను ఎవరూ అప్రమత్తం చేయలేదని మరో బాధితుడు స్టీఫెన్ ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు సంభవించిన మూడు కొండచరియల ప్రమాదాల్లో ముండక్కై, చూరల్‌మల, అట్టమల, నూల్‌పుజ గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ‘కొండచరియ లు విరిగిపడిన రోజు వర్షం కూడా భారీగా ఏమీ రాలేదు. సాయంత్రం చిన్నగా వర్షం మొదలైంది. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులెవరూ మాకు చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో హెలికాప్టర్ శబ్దం వచ్చింది. నా కుమారుడికి అనుమానం వచ్చి వెంటనే మనం ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని తొందరపెట్టాడు. ఇంత భారీ ఉపద్రవం వస్తుందని ఊహించలేదు’ అని స్టీఫెన్ వెల్లడించారు.