calender_icon.png 18 October, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి ఎక్కడ?

18-10-2025 12:59:56 AM

ఉద్యమానికి ఊపిరులూదుతాడా.. శాంతి కపోతం ఎగురవేస్తాడా?

-అగ్రనేతలు అజ్ఞాతం వీడుతుండంతో పోరుకెరటం లక్ష్మణరావు నిర్ణయంపై చర్చ

-14ఏళ్లు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం

-2018 నుంచి పార్టీ సెంట్రల్ కమిటీలో ఉన్నా.. కార్యకలాపాలకు దూరం

-పిలిప్పున్స్‌లో తలదాచుకుంటున్నట్లుగా పోలీసుల అనుమానం

భద్రతా దళాలు ‘ఆపరేషన్ కగార్’ చేపట్టిన నాటి నుంచి మావోయిస్టు పార్టీ అగ్రనేతలు నేలకొరగడమో లేదా అజ్ఞాతం వీడడం  జరుగుతోంది. ఒక్కొక్కరుగా నేతలు తమ అనుచరులతో జనజీవన స్రవంతిలో కలుస్తుండటంతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో 14ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోరుకెరటం ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఎక్కడా అనే చర్చ జరుగుతోంది. ‘మళ్లీ ఉద్యమానికి ఊపిరులూదుతాడా..లేక సహచర పార్టీ నేతల మాదిరిగానే శాంతికపోతం ఎగరేస్తాడా’ అనేది.. హాట్ టాపిక్‌గా మారింది.

కరీంనగర్, అక్టోబర్ 1౭ (విజయ క్రాంతి): నాటి పీపుల్స్ వార్ నుంచి నేటి మావోయిస్టు ఉద్యమం వరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి ఎందరో నేతలు కీలక పదవుల్లో కొనసాగారు. అందులో ముఖ్యుడు ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి. అయితే,మావోయిస్టు పార్టీ అగ్రనేతలైన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు తమ అనుచరులతో సహా అజ్ఞాతం వీడడంతో మావోయిస్టు పార్టీకి సుధీర్ఘకాలం పాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడ అన్న చర్చ కొనసాగుతోంది.

పిలిప్పున్‌లో తలదాచుకున్నాడని అనుమానాలు

ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలో రెడ్ బెల్టులో ఆయన పనిచేశారు. గణపతితోపాటు శ్రీనివాస్, రాజన్న, రాజిరెడ్డి, రాధాకృష్ణ, చంద్రశేఖర్ లాంటి అనేక పేర్లతో పిలవబడేవాడు. 2018లో ప్రధాన కార్యదర్శి పదవి వదులుకున్న అనంతరం ఆయన సెంట్రల్ కమిటీలో ఉన్నప్పటికీ మావోయిస్టు కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనలేదన్న పేరుంది. అయితే, ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ కూడా మొదలైంది. గణపతి నేపాల్ మీదుగా పిలిప్పున్స్ వెళ్లి అక్కడ తలదాచుకుంటున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గణపతి తర్వాత మొన్నటి వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన అనంతరం పార్టీ లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లు పెరగడంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 

ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉద్యమం వైపు

జగిత్యాల జిల్లా బీర్పూర్‌కు చెందిన ముప్పాల లక్ష్మణరావు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ నక్సలైట్ ఉద్యమంలో చేరారు. 2004లో పీపుల్స్ వార్ గ్రూపు మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంలో కీలకపాత్ర పోషించి ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. పీపుల్స్ వార్ నుంచి సీపీఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన అనంతరం సుదీర్ఘకాలం పాటు 2004 సెప్టెంబర్ 21 నుంచి 2018 నవంబర్ 10 వరకు 14ఏళ్ల పాటు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

ఇక మిగిలింది తిప్పరి తిరుపతే... 

మావోయిస్టు కేంద్ర కమిటీలో ఒకప్పుడు అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉండే వారు. ప్రస్తుతం తిరుపతి ఒక్కడే మిగిలారు. ఉమ్మడి జిల్లా నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన రెండవ వ్యక్తి తిప్పరి తిరుపతి అలియాన్ దేవ్‌జీ. నంబాల కేశవరావు మరణానంతరం ఆయనను ఈ పదవిలో నియమించారు. కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుకున్న రోజుల్లో ఆర్‌ఎస్‌యూ అధ్యక్షుడిగా పనిచేసి 1986లో ఎస్సారార్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ పై విడుదలైన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయి కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అయితే, ఉమ్మడి జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయిన అనంతరం తిరుపతి లొంగిపోతాడా?, మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తాడా? అన్న చర్చ కూడా కొనసాగుతుంది.