18-10-2025 12:05:56 AM
సామాన్యుడికి లాభం చేకూర్చని పరిశోధన నిష్ఫలం
హ్యూవెల్ నూతన కెమిస్ట్రీ ల్యాబ్ ప్రారంభోత్సవంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణలో మెడికల్ డివైసెస్ పార్కు ఏర్పాటు కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ర్టంలోని సుల్తాన్‌పూర్ మెడికల్ డివైసెస్ పార్క్‌లో హ్యూవెల్ సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్‌ను కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో 70.8 శాతం నుంచి 80 శాతం మనం వాడే మెడికల్ పరికరాలన్నీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.
అట్లా ఎందుకు ఉండాలి? మన దేశంలో ఎందుకు ఈ ఉత్పత్తులు కాకూడదు? ఇక్కడ ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గి, సామాన్యుడికి అందుబాటులోకి వస్తాయి’ అన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ప్రభుత్వంలో మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. పార్క్ ఏర్పాటుకు ముందు సుల్తాన్‌పూర్ ఏరియాలో స్టోన్ క్రషర్లు, మెటల్ క్రషర్లు, కొంత ఖాళీ జాగా తప్ప ఏమీ లేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తే వేల మం ది పని చేస్తుండడం, అనేక పరిశ్రమలు రావడం చూసి చాలా సంతోషం అనిపించిందన్నారు.
మేం అధికారంలోకి వచ్చాక ఇంకా బాగా చేస్తాం..
‘సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం, వ్యర్థం,’ అని కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ తెలిపారు. సాంకేతికత(టెక్నాలజీ) ఉన్నా దానివ ల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని కేసీఆర్ సందేశాన్ని ఆయన పునరుద్ఘాటించారు. హ్యూవెల్ సంస్థకు ఇది పదో వార్షికోత్సవం కావడంతో కేటీఆర్ ఆ సంస్థ బృందాన్ని అభినందించారు.
‘మీరు, మేము కలిసి హైదరాబాద్, తెలంగాణ, భారతదేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకె ళ్లాలని మనసారా కోరుకుంటున్నా’ అని కేటీఆర్ ఆకాంక్షించారు. ‘మరో రెండేళ్లలో మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు ఇంకా బాగా చేస్తాం’ అని అన్నారు. కొవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లకు, కొవిడ్ కిట్స్‌కు విపరీతమైన గిరాకీ, డిమాండ్ ఉండేదని, ఆ రోజుల్లో టెస్ట్ కిట్ కావాలంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని కేటీఆర్ గుర్తుచేశారు.
కానీ, అప్పట్లో రూ.6,000 ఖర్చయ్యే ఒక టెస్ట్ ధరను హ్యూవెల్ సంస్థకు చెందిన శిశిర్, రచన, వారి బృందం మొత్తం కలిసి కేవలం రూ.12కు తగ్గించామని చెప్పడం అద్భుతమన్నారు. పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ వంటి ఉత్పత్తుల ద్వారా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే పరిశోధనలు, కార్యక్రమాలు చేస్తున్నందుకు కేటీఆర్ హ్యూవెల్ బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో శాంత బయోటెక్ ఎండీ వరప్రసాద్ రెడ్డి, హ్యూవెల్ కంపెనీ ఎండీ, సిబ్బంది పాల్గొన్నారు.