calender_icon.png 18 October, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం టెండర్లకు నేడే చివరి గడువు

18-10-2025 01:01:02 AM

  1. దరఖాస్తుల ద్వారా రూ.3 వేల కోట్లు ఆర్జించాలని అంచనా
  2. ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు.. 1,500 కోట్ల ఆదాయం
  3. చివరిరోజు మరో 50 వేల దరఖాస్తులు వస్తేనే లక్ష్యం పూర్తి

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మద్యం షాపులకు దరఖాస్తులకు శనివారంతో గడువు ముగుస్తుంది. ఆశావహులకు ఇది చివరి అవకాశం. ఇది మిస్ అయితే మళ్లీ.. రెండేళ్ల వరకు నో ఛాన్స్! కాబట్టి.. అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకునే వారంతా దరఖాస్తులు సమర్పించండోచ్! ఇదేరోజు బీసీ సంఘాల జేఏసీ బంద్‌కు పిలుపునివ్వడంతో మధ్యాహ్నం 12 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంచాలని ఆబ్కారీశాఖ నిర్ణయించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం షాపులు ఉండగా గత నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 25 వేల దరఖాస్తులు అబ్కారీశాఖకు అందాయి. మొత్తంగా ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. చివరిరోజు ఒక్కరోజే 50 వేల వరకు దరఖాస్తులు వస్తాయని అబ్కారీ శాఖ అంచనా వేస్తున్నది. కానీ, అంతమేర దరఖాస్తులు రాకపోవచ్చని, 30 వేల వరకు మాత్రమే దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తున్నది.

రెండేళ్ల క్రితం మద్యం టెండర్లకు దరఖాస్తు ఫీజు (నాట్ రీ ఫండబుల్) రూ.2 లక్షలు ఉండగా, ఆ ఫీజును రూ.3 లక్షలకు పెరిగింది. ఈసారి దరఖాస్తుల ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం ఆర్జించాలని ఆబ్కారీ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు ద్వారా రాష్ట్ర ఖజానాకు కేవలం రూ.1,500 కోట్ల మేర ఆదాయం వచ్చింది.

చివరిరోజు మరో 50 వేల దరఖాస్తులు వస్తే తప్ప, ఆ శాఖ లక్ష్యం రూ.3 వేల కోట్ల టార్గెట్ నెరవేరినట్లవుతుంది. చివరి రోజు శనివారం ద్వాదశి మంచిరోజు కావడంతో టార్గెట్ పెద్దకష్టం కాదని ఆబ్కారీశాఖ భావిస్తున్నది. 2023- 25 సంవత్సరాలకు గాను 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర ఖజానాకు రూ.2,645 కోట్ల ఆదాయం వచ్చింది. 

హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్ డివిజన్ల పరిధిలోని 11 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 179 మద్యం షాపులకు శుక్రవారం నాటికి 1,809 దరఖాస్తులు వచ్చినట్లు ఆబ్కారీశాఖ వెల్లడించింది. చివరి రోజు ఆశావహుల రాకతో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

అలాగే రంగారెడ్డి డివిజన్‌లో వైన్ షాపులకు 10 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు దరఖాస్తుల సమర్పణకు ఆశావహులు బ్యాంకుల్లో డిమాండ్ డ్రాప్ట్ (డీడీ) తీయాల్సి ఉంది. శనివారం బంద్, తర్వాతి రోజు ఆదివారం, ఆ తర్వాతి రోజు దీపావళి కావడంతో రాష్ట్రప్రభుత్వం దరఖాస్తుల సమర్పణకు గడువు పెంచాలనే డిమాండ్ మొదలైంది.