calender_icon.png 25 August, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ చీఫ్ తేలేదక్కడే?

25-08-2025 01:32:05 AM

  1. వచ్చే నెలలో జోధ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సమావేశం
  2. నూతన అధ్యక్షుడిపై స్పష్టత వచ్చే అవకాశం!

న్యూఢిల్లీ, ఆగస్టు 24: దూసుకుపోతున్న బీజేపీకి కొత్త చీఫ్ ఎవరనేది సెప్టెంబర్‌లో తేలనున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జోధ్‌పూర్ వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్ సం ఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సమావేశం జరగనుంది. ఇదే సమావేశంలో బీజేపీ అధ్యక్షు డు ఎవరనే దానిపై స్పష్టత వస్తుందని వినికిడి. వరు స విజయాలతో ఊపుమీదున్న బీజేపీ కొత్త అధ్యక్షుడి కోసం గత కొద్ది రోజులుగా వేట కొనసాగిస్తోంది.

అందుకోసం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలను కూడా పూర్తి చేస్తోంది. బీజేపీ బాస్ పోస్ట్ ఈ నేతను వరిస్తుంది.. ఆ నేతను వరిస్తుంది అని పలు ప్రకటనలు వెలువడినా కానీ అధ్యక్షుడి ఎంపికపై స్పష్టత రాలేదు. బీజేపీ చీఫ్ విషయంలో మీడియా, పార్టీ కార్యకర్తలు, సా మాన్యుల ఊహాగానా లు కొనసాగుతూనే ఉన్నాయి. 

మూడు రోజులు భేటీ

బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ సెప్టెంబర్ 5-7 వరకు మూడు రోజుల పాటు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ వేదికగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఆర్‌ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరుకానున్నారు. అంతే కాకుండా ఆర్‌ఎస్‌ఎస్ జనరల్ సెక్రటరీ దత్తాత్రేయ హొసబలే, జాయింట్ సెక్రటరీలు, ఆర్‌ఎస్‌ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని మెంబర్స్, కోఆర్డినేటర్లు హాజరవనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

వీరు మాత్రమే కాకుండా బీజేపీ, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరన్ మంచ్, వన్‌వాసి కల్యాణ్, సేవాసమితి సభ్యులు కూడా మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అన్ని సంఘాల వారు గతేడాదిలో పనితీరుతో పాటు అనేక అంశాలపై చర్చించనున్నారు. అమెరికా సుంకాల మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో బీజేపీకి కాబోయే కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కూడా చర్చ జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సమావేశానికి బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ తదితరులు హాజరు కానున్నారు. ఆగస్టు 26 నుంచి 28 వరకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలో పర్యటించనున్నారు. విజ్ఞాన్ భవన్‌లో కొంత మంది నమ్మకస్తులతో ఆయన సమావేశం కానున్నారు. 2018లో కూడా ఆర్‌ఎస్‌ఎస్ అచ్చంగా ఇలాంటి సమావేశాన్నే విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసింది.