25-08-2025 11:18:14 AM
తెల్లవారుజామున 5 గంటలకే క్యూలైన్లో పాదరక్షలు పెట్టిన రైతులు
యూరియా కొరతతో చిన్నా సన్న కారు రైతులు ఆందోళన
కోదాడ : రైతులకు యురియా కష్టాలు(Urea Shortage) తప్పడం లేదు. తెల్లారింది మొదలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి గంటల తరబడి క్యూ లైన్ లో నిలుచున్న యూరియా దొరకకపోవడం కష్టంగా మారింది. ప్రస్తుతం వరి నాట్లు పూర్తయ్యాయి. రెండోదప యూరియా వేసే సమయం వచ్చింది. దీంతో యూరియా అత్యవసరమైంది.
అనంతగిరి మండల కేంద్రంలోని సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం పొద్దున్నే లేచి కడుపు మాడ్చుకొని వచ్చి పరుగులు పెడుతూ బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. ఇలా వారం నుంచి కొంతమంది రైతులు తిరుగుతున్న యూరియా దొరకడం గగనంగా మారిందని పంటలకు యూరియా వేసే తరుణంలో ప్రభుత్వం నిబంధనలు విధించి ఒక రైతుకు ఒక యూరియా బస్తా ఇవ్వడం ఏంటని రైతులు మండిపడుతున్నారు. మండలానికి సరిపడా యూరియా అందించి రైతులు సాగు చేసిన పంటలను కాపాడుకునేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.