calender_icon.png 14 July, 2025 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారును ముందుకు నడిపేదెవరు?

14-07-2025 01:25:40 AM

  1. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలెవరు?
  2. అక్కడ ఇన్‌ఛార్జి పోస్టులపై పలువురి కన్ను
  3. లోకల్ ఎన్నికల్లో గెలుపు కీలకం అంటున్న నేతలు 

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత, లోక్‌సభ ఎన్నికల ముందు ఆ తర్వాత ఒకొరొ కరుగా ఈ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్య క్రమాలు పర్యవేక్షించేందుకు ఇన్‌ఛార్జీలను గులాబీ పార్టీ ఇప్పటివరకు ప్రకటించలేదు.

కానీ కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ తరుఫున కొందరు నేతలు యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో కడియం శ్రీహరి టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

అయితే లోక్‌సభ ఎన్నికల ముందు శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ సీటును కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆ నియోజవర్గంలో రాజయ్య యా క్టివ్‌గా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఉండే నేతలు పార్టీ తరుఫున చురుగ్గా వ్యహరిస్తున్నా నియోజకవర్గ ఇన్‌ఛార్జీలను ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. 

ఎన్నికల్లో సత్తా చాటేలా..

గ్రేటర్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతున్నది. ఇక్కడ గెలవడం బీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా సాధ్యమైనంత తొందరలో ఇన్‌ఛార్జిని ప్రకటించాలని గులాబీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవలే పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు   ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.

పార్టీని యాక్టివ్ చేసేందుకు నేతలు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించినట్లు సమాచారం. దీనితో పాటు పార్టీలో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావా లన్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని న్యాయస్థానంలో బీఆర్‌ఎస్ పోరాడుతోంది. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని గులాబీ నేతలు అంటున్నారు.

ఒకవేళ వారిపై అనర్హత వేటు పడితే వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ తరుఫున ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇన్‌ఛార్జిల నియామకం త్వరగా చేపట్టాలని అధిష్ఠానం దృష్టికి పార్టీ వర్గాలు తీసుకువెళ్తున్నట్లు సమాచారం. అటు జూబ్లీహిల్స్ బైఎలక్షన్స్‌లో గెలవడం, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాను చాటడం గులాబీ పార్టీకి కీలకం కానున్న నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదును తొందరగా చేపట్టడం, కమిటీల నియమించడం, నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలను నియమించాలని పార్టీ నేతలు కోరుతున్నారు.

ఇన్‌ఛార్జి బాధ్యతలపై పలువురి ఆసక్తి

బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో భద్రాచలం, గద్వాల్, చేవేళ్ల, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, స్టేషన్ ఘన్‌పూర్, బాన్సువాడ, జగిత్యాల, పటాన్‌చెరువులు ఉన్నా యి. ఈ నియోజవర్గాల్లో ఇప్పటివరకు ఇన్‌ఛార్జిలను ప్రకటించకపోవడంతో ఇబ్బందు లు వస్తున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.

చాలా నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జి బాధ్యతలను స్వీకరించేందుకు అనేకమంది స్థానిక నేతలు, గతంలో టికెట్ ఆశించి భంగపడ్డవారు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే కొద్దిరోజుల్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు లేని దగ్గర పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు తప్పేలా లేవన్న టాక్ వినిపిస్తోంది.

గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లలో గ్రామీణ ప్రాంతాలు లేనందున లోకల్ బాడీ ఎన్నికలు ప్రభావం అంతగా ఉండవు. అయితే మిగతా నియోజకవర్గాల్లో లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి, దీనితో అక్కడ పార్టీని స్థానిక ఎన్నికల్లో సమాయత్తం చేసేందుకు, క్యాడర్‌ను సమన్వయం చేసేందుకు ఇన్‌ఛార్జిలు ముఖ్యమన్న అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారు.