14-07-2025 01:32:21 AM
మంచిర్యాల, జూలై 13 (విజయక్రాంతి)/ లక్సెట్టిపేట్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటలో ఏర్పాటు చేసిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు, హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ శివారులో 212 ఎకరాలలో రూ.30 కోట్ల అంచ నా వ్యయంతో ఇండస్ట్రీయల్ పార్క్, ఆటోనగర్ ఏర్పాటుకు, దండేపల్లి మండలం రెబ్బె నపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రూ.17 కోట్లతో నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి సోలార్ పవర్ ప్లాంట్‌కు ఆరో గ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌లతో కలిసి భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటు, నవీకరణ కార్యక్రమాలను చేపట్టిందని, ఇందులో భాగంగానే లక్సెట్టిపేట మం డల కేంద్రంలో రూ. 8.50 కోట్ల ప్రభుత్వ, రూ.కోటి సింగరేణి నిధులతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. మండల కేంద్రంలో రూ.10.20 కోట్ల సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను నిర్మించామన్నారు.
-మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రోత్సహిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు చేయూతనిస్తూ దండేపల్లి మండలం అందుగుల పేట (వెల్గనూర్)లో 4 ఎకరాల విస్తీర్ణంలో రూ.3 కోట్ల వ్యయంతో సోలార్ పవర్ ప్లాం ట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రోజుకు సు మారు 4,500 నుంచి 5 వేల యూనిట్ల వర కు విద్యుత్ ఉత్పత్తి జరిగి ఏడాదికి దాదాపు రూ.51 లక్షల రాబడి వస్తుందని తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లక్ష్యం: శ్రీధర్‌బాబు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యా, వైద్యంతో పాటు మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేస్తుందని రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు ద్వారా రాబోయే రోజులలో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని, పెద్ద మొత్తంలో పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుందని, మొదటి సంవత్సరం రూ.21,632 కోట్లు అందించామన్నా రు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్‌టీసీ బస్సులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెరటి కోళ్ల పెంపకం, పాల డైరీ, పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళా శక్తి భవనాల ఏర్పాటు, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.
ఈసందర్భంగా అటవీ శాఖకు సంబంధించిన నూతన వా హనాలను ప్రారంభించి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర భుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందిస్తుందని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్టు తెలిపారు.
రైతు సంక్షేమం కోసం 70 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసా కింద 9 రోజులలో రూ.9 వేల కోట్ల పెట్టుబడి సహాయం అందించామని చెప్పారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేయడంతో పాటు పంట నష్టపరిహారం అందించామన్నారు. రూ.17 వేల కోట్లతో 29 లక్షల పంప్ సెట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి మొదలు పెడతామని, రాజీవ్ యువ వికా సం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కొరకు ఆర్థిక చేయూత అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. లక్సెట్టిపేట మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలను ప్రారంభించామని తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చేరుతున్నారని తెలిపారు.