calender_icon.png 6 September, 2025 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసలు సూత్రధారి ఎవరు?

05-09-2025 01:12:28 AM

  1. రూ.500 కోట్ల స్కాములో బడాబాబులు అదుపులోకి తీసుకుని ఎందుకొదిలేశారు..?
  2. ఆ హోటల్ రూములో ఏం జరిగింది..?
  3. నిందితుడి నుంచి రూ.2 కోట్ల ముడుపులా..?
  4. కలెక్టర్ ఆదేశించినా.. అన్యాయమేనా..?
  5. వీడియో రూపంలో బాలాజీనాయక్ బెదిరింపులు

నిఘా విభాగం, సెప్టెంబరు 4 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లాలో నయా దందా పేరుతో బురిడీ కొట్టించిన వ్యవహారం ఇంకా క్లోజ్ కాలేదు. పేదల అమాయకత్వం.. అధిక వడ్డీ ఆశజూపి రూ.కోట్లకు కోట్లు వసూలు చేశాడో ఘరానా కేటుగాడు. నూటికి రూ.10 నుంచి రూ.15 శాతం వడ్డీ అని చెప్పి.. మారుమూల మండలాలు.. పల్లెల్లో రూ.కోట్లకు కోట్లు కాజేశాడు. తనకంటూ స్పెషల్గా మధ్యవర్తులను నియమించుకుని వారి ద్వారా రూ.కోట్లు కాజేశాడు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా.. పాకి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ జిల్లా పోలీసు శాఖకు ఫిర్యాదును పరిశీలించాలని రిఫర్ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసు శాఖ సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని దాదాపు రెండు రోజుల పాటు విచారించినట్టు సమాచారం. కానీ ఇంతలోనే ఏం జరిగిందో..? ఏమో గానీ.. మూడు రోజుల తర్వాత సదరు నిందితుడిని వదిలేశారు.

ఈ వ్యవహారంలోకి అధికార, ప్రతిపక్ష పార్టీల లీడర్లు రంగంలోకి దిగి విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీనాయక్.. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అప్పటివరకు డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూసిన బాధితులు.. బాలాజీ నాయక్ వీడియోతో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. 

ఇటీవల వీడియో రిలీజ్‌తో ఆందోళన..

నల్లగొండ  జిల్లా పెద్ద అడిశర్ల పల్లి మండలం పలుగు తండాలో వారం పది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధిక వడ్డీకి ఆశపడి తండాకు చెందిన బాలాజీ నాయక్కు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోట్లాది రూపాయలు డిపాజిట్గా ఇచ్చారు. నూటికి రూ.10 నుంచి రూ.16 వరకు వడ్డీ ఇస్తానని ఏజెంట్లను పెట్టుకొని డబ్బులను వసూలు చేశారు.

గతంలో బాలాజీనాయక్ అతడి ఏజెంట్లను నల్లగొండ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసి బాధితులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వదిలిపెట్టారు. ఇటీవల ఏజెంట్లుగా వ్యవహరించిన సర్దార్, రమేష్, రాజులు పలుగుతండాకు రాగా వారిని బాధితులు నిలదీసి వారి కార్లను స్వాధీనం  చేసుకున్నారు.

మరోవైపు తాను కొంతమంది సన్నిహితుల వద్ద అప్పులు తీసుకున్న మాట వాస్తవమేనని వారికి తాను తిరిగి డబ్బులు ఇస్తానని ఏజెంట్లు అని చెప్పుకొని వారు తీసుకున్న అప్పులకు తనకు సంబంధం లేదని బాలాజీ నాయక్ వీడియో విడుదల  చేయడంతో బాధితుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఆ హోటల్లో ఏం జరిగింది..?

గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలాజీ నాయక్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. కానీ ఆ తర్వాత వదిలేశారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత హైదరాబాద్ రోడ్డులోని ఓ హోటల్ గదిలో దాదాపు 3 గంటల పాటు కొంతమంది మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ఏకంగా రూ.కోట్ల మేర సెటిల్మెంట్ జరిగాయనే ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి.

కానీ ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం తెలియడం లేదు. అంత పెద్దమొత్తంలో భారీ స్కామ్  చేసిన నిందితుడిని అసలు పోలీసులు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది..? కనీసం ఎఫ్‌ఐఆర్ సైతం నమోదు చేయలేదు. అధికార పార్టీ లీడర్లో.. ప్రతిపక్ష పార్టీ లీడర్లో చెప్పారని నిందితుడిని వదిలేస్తే.. ప్రజలకు న్యాయం జరిగేది ఏలా..? అన్న ప్రశ్నలు పలు అనుమానాలను రేకేత్తిస్తోంది.