09-05-2025 12:00:00 AM
ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారత్‌లో జనగణనలో భాగంగా జాతి ఆధారిత జనగణన (కులగణన) చేయాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీలకు కులమతాలకు అతీతంగా సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. 1948 భారత జనాభా గణాంక చట్టం ప్రకారంగా జనగణన చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి భారతదేశంలో జనాభా లెక్కలను సేకరిస్తారు.
1881 నుంచి 1931 వరకు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో మన దేశంలో జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టేవారు. కానీ, స్వాతంత్య్రం వచ్చాక 1951 నుంచి 2011 వరకు 7 పర్యాయాలు జనాభా లెక్కలను సేకరించినా అందులో భాగంగా ఒక్క ఎస్సీ ఎస్టీ కులాల లెక్కలు మాత్రమే సేకరించారు. కానీ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కుల ఆధారిత గణనని మాత్రం చేపట్టలేదు.
ఏడు దశాబ్దాలుగా దేశంలో జాతి ఆధారిత జనగణన జరగక పోవటం వల్ల మెజారిటీ ప్రజల ఆర్థిక సామాజిక రాజకీయ విద్య ఉద్యోగాలలో వారి స్థితిగతులను వెనుకబాటు తనాన్ని అంచనా వేయలేకపో యాం. దశాబ్దాల తమ వెనుకబాటుకి ఇలా కులగణన చేపట్టక పోవటమే అనే భావనతో బలహీన వర్గాలు ఈ డిమాండ్‌ని తెరపైకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
జాతి ఆకాంక్ష
కులగణన జరగాలనేది జాతి ఆకాంక్ష. దేశంలో మెజారిటీ కులాల లెక్కలు సేకరించక పోవడం వల్ల ఆర్థిక సామాజిక రాజ కీయ ఉద్యోగ విద్యా విషయాలలో వారి స్థా యిని, వెనుకబాటుతనాన్ని అంచనా వేయలేకపోయాం. కాబట్టి, ప్రభుత్వ విధానాలలో బడ్జెట్ కేటాయింపులలో ఆయా కులాలకు ప్రాధాన్యం దక్కలేదు. జనగణనలో భాగం గా కులాల లెక్కలతోపాటు వివిధ అంశాలలో వారి వెనుకబాటుకి సంబంధించిన లెక్కలనుకూడా తీయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
దేశంలో పులులు, సింహాలు, జంతువులు, చెట్లు అడవులకి సంబంధించిన లెక్కలు ఉంటాయి కానీ, తమ జనాభా ఎంత? వివిధ రంగాలలో మాకు దక్కుతున్న ప్రాధాన్యత ఎంత? అనే విషయాల లెక్కలు సేకరించరా? అనే ప్రశ్న బలహీనవర్గాల నుంచి వస్తున్నది. దశాబ్దాల తర్వాతనైనా కులగణన చేపట్టడానికి ప్రభుత్వం ముందు కు రావడం శుభ పరిణామం.
ఎందుకు?
విభిన్న కులాలుగా విడిపోయిన భారత సమాజంలో వెనుకబాటుతనాన్ని అసమానతల స్థాయిని తెలుసుకొని ఆ మేరకు సామాజిక న్యాయాన్ని సాధించడానికి జాతి ఆధారిత కులగణన ఒక మార్గం. సామాజిక న్యాయ లక్ష్యసాధనకే నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రణాళికలను ప్రారంభించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. కానీ, ఈ ఏడు దశాబ్దాలలో దేశంలో అసమానతలు పెరిగి సామాజిక న్యాయానికి తూట్లు పడ్డాయి.
కులగణన చేపట్టడం అంటే దేశాన్ని కులాల వారీగా విభజించటం కాదు. కులగణన దేశంలో ఉన్న సామాజిక ఆర్థిక అసమానతలపై ఎక్కుపెట్టిన ఒక విల్లుగా భావించాలి. కులం ఆధారంగా వెనుకబాటుతనాన్ని గుర్తించవచ్చని 1992 ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
దేశంలో ఉన్న అసమానతల స్థాయిలను తెలుసుకోవటానికి, రిజర్వే షన్లను మరింత హేతుబద్ధంగా అమలు చేయటానికి, బడ్జెట్ నిధులను కేటాయించటానికి, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు, సంక్షేమ పథకాల ప్రకటనలకు, వాటిని నిజమైన లబ్ధిదారులకు చేరవేయడానికి జాతి ఆధారిత గణన దోహదపడుతుంది.
స్వాతంత్య్రం వచ్చాక భారతదేశంలో ఏ కమిషన్ రిపోర్ట్, మరే సర్వే చూసినా అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నాయనే విషయం స్పష్టమవుతుంది. బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో 34 శాతం బీహారీల ఆదాయం రోజుకి కేవలం 200 రూపాయలే. వారి నెలవారీ ఆదాయం కేవలం 6,000 రూపాయలే అనే విషయాన్ని బీహారీ జాతి ఆధారిత గణనే బయటపెట్టింది.
అలాగే, బీహార్‌లో రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెంచటానికి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచటానికి కూడా ఆయా రాష్ట్రాలలో జరిగిన కులగణననే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి.
దేశంలోని 2600 ఓబీసీ కులాలలో 983 కులాలకు విద్య ఉద్యోగాలలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదని జస్టిస్ రోహిణి కమిషన్ తన రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి, ఇలాంటి అసమానతలను తెలుసుకోటానికి వాటిని సరి చేసి సామాజిక న్యాయాన్ని సాధించడానికి జాతి ఆధారిత జనగణన ఉపయోగకరంగా ఉంటుంది.
క్రెడిట్ ఎవరిది?
1951 నుంచి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జనగణనలో భాగంగా జాతి ఆధారిత జనగణన చేయటానికి ముందుకు రాలేదు. 1953 కాకా కలేల్కర్ కమిషన్, 1978 మండల్ కమిషన్, 2017 జస్టిస్ రోహిణి కమిషన్‌లు సామాజిక న్యాయసాధన కోసం సామాజిక ఆర్థిక అసమానతల స్థాయిలను తెలుసుకోటానికి కులగణన జరగాలని సూచించినా ప్రభుత్వాలు ఈ విషయంలో కమిషన్ రిపోర్ట్‌లను పరిగణలోకి తీసుకోలేదు.
కానీ, 2022లో బీహార్ ప్రభుత్వం బీహారీ జాతి ఆధారిత గణన చేపట్టడంతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా అదే స్ఫూర్తితో కులగణన సర్వేలను చేపట్టి నివేదికలను బహిర్గతం చేశాయి. దేశంలో మరికొన్ని రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా కులగణన చేపడతామనే ప్రకటనలు చేయడంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ మొదలైంది.
18వ లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన పాంచ్ న్యాయ్‌లో భాగంగా హిసేదారి న్యాయ్‌లో దేశవ్యాప్తంగా జనగణంలో భాగంగా కులగణన జరగాలని, దేశంలోని అసమానతలను తెలుసుకోవటానికి అది ఒక ఎక్స్‌రేలాగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. కులగణన రిజర్వేషన్ల అంశాలు కాంగ్రెస్ పార్టీకి ఒక దశాబ్దం తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ హోదా దక్కటానికి సహాయపడితే, బీజేపీకి మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజార్టీనీ దక్కకుండా చేశాయి.
భవిష్యత్తులో కులగణన అంశం కాంగ్రెస్‌కు, సమాజ్‌వాది పార్టీకి, ఆర్‌జేడీకి ఒక రాజకీయ అంశంగా మారితే బీజేపీకి ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో ఆ పార్టీ కులగణన వైపుకి మొగ్గక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. కులగణన క్రెడిట్ రాహుల్‌గాంధీకి దక్కకూడదని, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ కులగణన చేయాలనే ఆలోచన కూడా చేయలేదని బీజేపీ కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తున్నది. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు కులగణన చేయాలనే ప్రభుత్వ నిర్ణయం దశాబ్దాల బలహీన వర్గాల కలను నిజం చేసింది.
ఇక్కడితో ఆగిపోకూడదు!
కులగణన ఒక చారిత్రాత్మక నిర్ణయం. దీనిద్వారా దేశంలోని వివిధ కులాల ఆర్థిక సామాజిక స్థాయిలను తెలుసుకోవటానికి మాత్రమే పరిమితం కాకూడదు. జాతి ఆధారిత గణనద్వారా బహిర్గతమైన వివిధ కులాల వెనుకబాటుతనాన్ని అధిగమించే విధంగా చర్యలు చేపట్టాలి. కావలసిన విధానాలు రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. గత అనుభ వాల దృష్ట్యా ప్రభుత్వాలు కేవలం కులగణనకి మాత్రమే పరిమితమైతే జాతి ఆధారిత జనగణన లక్ష్యం నెరవేరదు.
బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి, సంక్షే మానికి 1980లో మండల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే దానిని అమలు చేయటానికి ప్రభుత్వాలకు ఒక దశాబ్దానికి పైగా పట్టింది. మండల్ కమిషన్ 40 సిఫారసులు చేస్తే ఒక్క రిజర్వేషన్ల అంశం తప్ప ఏ ఒక్క సిఫారసునూ అమలు చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాకపోవటం విచారకరం. ప్రభుత్వాలు కేవలం కులగణనకి మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని కిందివర్గాల అభ్యున్నతికి, సమానత్వానికి చర్యలు చేపట్టాలని ఆశిద్దాం.
వ్యాసకర్త సెల్: 9885465877