calender_icon.png 24 May, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక పాక్ చేసేదేమిటి?

09-05-2025 12:00:00 AM

పహల్గాంలో దాడికి కారణమైన ఉగ్రవాద సంస్థల నడ్డి విరచడంలో దృఢ సంకల్పాన్ని భారత్ ప్రపంచానికి చాటింది. అరగంటలోపే ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తయ్యిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద స్థావరాలను కొన్నింటిని నేలమట్టం చేసింది. 1971 యుద్ధం తర్వాత మొదటి సారిగా త్రివిధ దళాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొనడం విశేషం.

బహావల్‌పూర్‌లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడిలో తన కుటుంబసభ్యులు 10 మంది, అనుచరులు నలుగురు మరణించారని ఆ సంస్థ చీఫ్, కరుడుగట్టిన భారత్ వ్యతిరేక ఉగ్రవాది మౌలానా మసూద్ అజా ర్ ధ్రువీకరించడం దాడి తీవ్రతను తెలియజేస్తున్నది. పాకిస్థాన్ సైనిక స్థావరాలను, నివాస ప్రాంతాలను మినహాయించి భారత్ నిర్దిష్టంగా, ఏకలక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించిందనడంలో సందేహమేమీ లేదు.

క్షిపణుల లక్ష్యం ఉగ్రవాదుల భవనాలు, భవన సముదాయాలేనని జరిగిన దాడులు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రవాద స్థావరాలకు పెట్టింది పేరైన బహావల్‌పూర్, మురిద్కేలలో వాయుసేన క్షిపణులతో సాగించిన విధ్వంసం ఆ ఉగ్రసంస్థకు పెద్ద దె బ్బే. కొద్ది రోజులుగా పహల్గాం ఘటనపై భారత్ ప్రతిచర్య ఎలా వుంటుందో అర్థంకాక తలపట్టుకున్న పాకిస్థాన్ గొంతులో ఇప్పుడు పచ్చివెలక్కాయ పడ్డట్టయ్యింది.

పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని కాలరాచి తమ దేశంపై యుద్ధ మే చేసిందని ఆ దేశ ప్రధానమంత్రి  గొంతు చించుకుంటున్నా ప్రపంచ దేశాలనుంచి సానుభూతి కరువైంది. ఆపరేషన్ సిందూర్‌తో కునారిల్లిన పాకిస్థాన్ ఎల్‌ఓసీ వెంబడి సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బిక్కుబిక్కుమంటున్న పాకిస్థాన్ తన ప్రతాపాన్ని సరిహద్దుల్లో చూపిస్తోంది.

రెండు వారాలుగా నిశిరాత్రి చీకట్లలో పాకిస్థాన్ సైన్యం కవ్వింపులకు పాల్పడుతూనే  ఉంది. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ ఆర్మీ మోర్టార్ షెల్లింగ్, కాల్పులతో విరుచుకు పడుతోంది. ఈ కాల్పులను భారత సైన్యం ఎప్పటికప్పుడు దీటు గా తిప్పి కొడుతున్నది. నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైన్యం కొనసాగిస్తున్న కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మంగళవారం 13 మంది భారత పౌరులు, బుధవా రం రాత్రి ఒక జవాన్ పాకిస్థాన్ కాల్పులకు బలయ్యారు. ఇలా రెండు వారాలుగా పాకిస్థాన్ సైనిక బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లం ఘిస్తూనే ఉన్నాయి. పాక్ ఇలా ఎన్ని రోజులు కవ్వింపు చర్యలను కొనసాగిస్తుంది? ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు మిగిలి వున్న దారులేమైనా ఉన్నాయా? ఉగ్రవాదుల కార్యకలాపాలు తమ గడ్డపైనుంచి కొనసాగనీయకుండా కట్టడి చేయగలుగుతుందా? ఈ ప్రశ్నలకు పాకిస్థాన్ పాలకులు సమాధానం చెప్పే పరిస్థితులలో లేరు.

2008 నవంబర్ 26న ముంబైపై పాకిస్థాన్ ఉగ్రమూక దాడి చేసి మూడు రోజులపాటు మారణహోమం సృష్టించినప్పుడు, ప్రపంచ దేశాలన్నీ ఆ దాడిని ఖండించాయి. అప్పుడు పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేసినా చాలా దేశాలు మద్దతునిచ్చేవి. కాని, భారత్ సంయమనం పాటించింది.

ముంబైపై దాడికి దిగిన ఉగ్రసంస్థలను శిక్షించేందుకు భారత్ అప్పుడు న్యాయమార్గాన్నే ఎంచుకొంది. ఇలాంటి ఉగ్రచర్యలు ఎన్ని జరిగినా పాకిస్థాన్ ముందుకు తెచ్చేది ఒక్కటే ‘కశ్మీర్ సమస్య’. ఆ సమస్యను పాకిస్థాన్ నిజంగానే పరిష్కరించుకునేందుకు.. సామరస్య మార్గాన్ని ఎంచుకొనేందుకు ఆ దేశ రాజకీయ నాయకులు ఎప్పటికైనా సిద్ధపడతారా?