calender_icon.png 25 May, 2025 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదంపై ఆధిపత్యమే లక్ష్యంగా!

09-05-2025 12:00:00 AM

‘ఆపరేషన్ సిందూర్’తో మనది 2008 నాటి యూపీఏ భారత్ కాదని, సైనికశక్తితోపాటు ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం అన్నిటికీ మించి, జరిగిన అవమాన అన్యాయాలకు, మొత్తంగా భావోద్వేగంపై విసిరిన సవాలుకు దీటైన ప్రతీకార సమాధానం ఇవ్వగల శక్తివంతమైన ఎన్‌డీఏ ఆధ్వర్యంలోని దేశమని ఒక్క దాయాది దేశానికే కాదు, యావత్ ప్రపంచానికే నిరూపించినట్టయింది.

ఇటీవలి పహల్గాం నీచ హత్యాకాండతో ఉగ్రమూర్ఖులు భారతీయ సెంటిమెంట్‌ను, ఇంకా పని కట్టుకుని భారతీయ స్త్రీశక్తిని అనవసరంగా గెలికి, ఇప్పుడు తమ ఉనికికే ముప్పు తెచ్చి పెట్టుకున్నారు. ప్రధాని మోదీ ప్రస్తుత విధానం చూస్తుంటే, పహల్గాం పరాభవా న్ని ఆయన అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేరు.

ముల్లును ముల్లుతోనే కాదు, అంతకంటే వాడి అయిన ఆయుధంతో ఎలా తీయాలో, మొత్తం ముళ్ళకంపను ఏ రకం గా పెకిలించి వేయాలో ఆయనకు బాగా తెలిసినట్టే ఉంది. శత్రువు దొంగదెబ్బకు తెలివితక్కువగా రెచ్చిపోకుండా గురిచూసి, కాచుకొని గుండె పగిలేలా చావుదెబ్బ కొట్టడానికే ఆయన ముహూర్తం నిర్ణయించార నిపిస్తున్నది.

పాకిస్థాన్ కుటిలనీతికి తగ్గట్టు అటు యుద్ధ నైపుణ్యాన్ని, ఇటు రాజనీతిని ప్రధా ని మోదీ సమర్థవంతంగా ప్రదర్శిస్తున్నారు. ఉగ్రవాద రక్షణనుంచి దానిపై ఆధిపత్యం సాధించడం వైపుగా ఆయన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనలో దీనిని అనూహ్య మార్పుగానే చెప్పాలి. ఎన్‌డీఏ, యూపీఏ ప్రభుత్వాల మధ్య ఇది అతిపెద్ద ఆచరణాత్మక విధాన పరమైన వ్యత్యాసం.

సైనిక ప్రతీకారం అన్నది ఇటీవల ‘ఎప్పుడు’ అనే ది ముఖ్యం కాదు, ’ఎలా’ అన్నదే ప్రధానంగా మారింది. 2008 నాటి అప్రసిద్ధ 26/11 ముంబై దాడి, ఇటీవలి అనాగరిక పహల్గామ్ విషాదం కేస్ స్టడీని ఉపయోగించి ఈ ప్రభుత్వాల (యూపీఏ, ఎన్‌డీఏ) మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించిన విశ్లేషకులకు ఈ విషయం స్పష్టమైంది. 2008 నవంబర్ 26న భారత ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన 26/11 దాడి ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత భయంకరమైన, ప్రాణాంతకమైన, బెదిరింపులతో కూడుకున్న దుర్మార్గానికి మధ్యగల వ్యత్యాసం చాలా స్పష్టం.

ఆనాడు పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు చెందిన పదిమంది తీవ్రవాదులు నగరంలోకి చొరబడి, కీలక ప్రదేశాలకు వ్యాపించి, అత్యంత భయంకరమైన దేశీయ దాడిని అమలు చేశారు. విభిన్న ప్రదేశాల చుట్టూ బాంబు దాడులు చేయడం, అమాయక పౌరులను బందీలుగా తీసుకోవడం, అనేక రోజులపాటు గందరగోళం సృష్టించడం. అప్పట్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

అప్పటి ప్రభుత్వానికి ఆ ఆసక్తి లేదు!

ఆనాడు ఉగ్రవాదులు ముంబైలోకి ప్ర వేశించారనే వాస్తవం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ప్రపంచవ్యా ప్త తీవ్రవాద వ్యాధి జమ్ముకశ్మీర్‌కు మా త్రమే పరిమితం కాలేదనీ, దేశవ్యాప్తంగా వ్యాపించిందని బోధపడింది. ఉగ్రవాది కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. దీనికంతటికీ పాకిస్థాన్ వెనుక ఉందని అతను ఒప్పుకున్నాడు. నేరస్థుడి సాక్ష్యం భారతదేశానికి లభించింది. దానిని ప్రపంచం చూసింది.

పాకిస్థాన్ వణికి పోయింది. భారత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఆనాటి యుపీఏ పాలకులలో రక్తం మరగలేదు. బదులుగా, వారు తక్కువ స్థాయి స్పందనను కనపరిచారు. కారణం, పాకిస్థాన్‌ను దౌత్యపరంగా ఒంటరిని చేయడానికి జరిగిన ప్రయత్నం కావచ్చు. పాకిస్థాన్ సైన్యం అమానవీయ చర్యలను ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్న సుశిక్షిత సాయుధ దళం భారత్‌కు ఆనాడూ ఉంది.

కానీ, అప్పటి ప్రభుత్వానికి ప్రతీకారం తీర్చుకోవడంలో ఆసక్తి లేకపోవడం అసలు విషయం. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ‘శాంతి’, ‘సోదరభావం’ వైపు ఎక్కువ మొగ్గు చూపారు. అమాయక పౌరులను కనికరం లేకుండా కాల్చి చంపారు, బందీలను తుపాకీతో బెదిరించి హింసించారు. దేశం విలపించింది. అయినప్పటికీ ఆనాడు దేశం వారిని ఏమీ చేయలేక పోయింది.

26/11 దాడులలో ఐఎస్‌ఐ ప్రమేయం ఉందని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ఎటువంటి దౌత్యపరమైన ఒంటరితనాన్ని ఎదుర్కోలేదు. దానిపై ఆర్థిక ప్రతి ఘటన చర్యలూ తీసుకోలేదు. సైనిక చర్యలు జరగలేదు. బదులుగా, భారతదేశం సంయమనం, ప్రతిచర్యాత్మక దౌ త్యం మాత్రమే అనుసరించింది. ప్రపంచ వేదికలపై భారత్ తనదైన విధానాన్ని నడిపించడం కంటే పాకిస్థాన్ ఆరోపణలకు ప్రతిస్పందించడంపైనే ఆనాటి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది.

ఇది పాకిస్థాన్‌ను బహుళ ప్రదేశాలలో భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి పరో క్షంగా ప్రోత్సహించినట్టు అయ్యింది. “మేం ప్రతీకారం తీర్చుకోము కానీ బదులుగా దౌత్యమార్గాన్ని ఎంచుకుంటాం” అన్నట్టుగా సందేశాన్ని ఇచ్చింది.

ఇది ఇస్లామిక్ రిపబ్లిక్‌కు పెద్దగా హాని కలిగించని మార్గం. 2010 పూణే జర్మన్ బేకరీ పేలుడు, 2011 ముంబై ట్రిపుల్ పేలుళ్లు, 2013 హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లు, ఇంకా అలాంటి అనేక ఇతర దాడులు. ప్రతి ఒక్కటీ ఒకే సంతకాన్ని కలిగి ఉన్నాయి. సరిహద్దు ప్రణాళిక, స్థానిక ఎత్తుగడలు, భారత ప్రతీకార భయమన్నదే లేకపోవడం.

హిందువులపై ప్రత్యక్ష దాడి

ఇదంతా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సరిహద్దు ఉగ్రవాదానికి భారతదేశం పిరికి విధానాన్ని వెల్లడించిన తర్వాత జరిగింది. సైనిక పరంగా ప్రభుత్వ విధానాన్ని తీవ్రతరం చేయడానికి తన అయిష్టతను సింగ్ సమర్థించుకోవడమే కాక అదే ‘సరైన వైఖరి’ అని ఏకపక్షంగా ప్రకటించారు. 2009 నవంబర్ 22న అమెరికా పర్యటన సందర్భంగా ఆయన ఇలా అంగీకరించారు: “26/11 తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని నాపై అపారమై న ఒత్తిడి ఉంది. కానీ నేను దానిని ప్రతిఘటించాను. అది సరైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను.”

ఇది భారతదేశం పూర్తిగా దౌత్యంపై ఆధార పడుతుందని, ఎటువంటి ఉద్రిక్తతలకు పోకుండా దూరంగా ఉంటుందనే అభిప్రాయానికి దారితీసింది. ఐఎస్‌ఐ, ఇస్లామాబాద్ కోరుకున్నది ఇదే. పరిణామాలకు భయపడకుం డా లక్ష్యంగా దాడులు చేయడానికి వారు స్వేచ్ఛగా ఉన్నారు. కానీ, భారతదేశంలో 2014లో జరిగిన ప్రభుత్వ మార్పు వారికి ఒక కుదుపు. ఇది నేటికీ వారిని కలవరపెడుతోంది. మోదీ హయాంలో ఆచరణా త్మక మార్పు సంభవమైంది. 

22 ఏప్రిల్ 2025. లోయలో సెలవులు గడుపుతున్న అమాయక పర్యాటకులను ఎంపిక చేసిన వ్యక్తులతో కాల్చి చంపారు. ఇది కేవలం దాడి కాదు, మతపర ప్రక్షాళన. చాలా క్రూరమైన మారణహోమం, దాని మచ్చ ఇప్పటికీ జాతీయ మనస్సాక్షిలో నలిగిపోతున్నది. ఉగ్రవాదులు ప్రజలను వరుసలో నిలబెట్టారు, వారి మతాన్ని అడిగారు. ‘హిందూ’ అని సమాధానం ఇచ్చిన వారిని అక్కడి కక్కడే కాల్చి చంపారు.

సంకోచించిన వారిని కల్మా పఠించమని అడిగారు; వారి విశ్వాసాన్ని ధృవీకరించడానికి ప్యాంటును కిందికి లాగారు; ముస్లిమే తరుల తలపై కాల్చి చంపారు. బాధితుల్లో ఒకరి భార్య ఇలా గుర్తు చేసుకుంది: “నేను ఉగ్రవాదిని నన్నుకూడా కాల్చమని అడిగినప్పుడు, అతను, ‘వద్దు. వెళ్లి మోడీకి చెప్పు’ అన్నాడు. 1989 అనంతరం కశ్మీరీ పండిట్ల భయంకరమైన వలస తర్వాత, ఇది హిందువులపై మరొక ప్రత్యక్ష దాడి. ఈ అనాగరికత దేశవ్యాప్తంగా ప్రకోప తరంగాలను పంపింది. ప్రజలు కోపంగా ఉన్నారు, న్యాయం కోసం డిమాండ్ చేశారు.

- పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక, ప్రాథమిక అవసరాలకు సంబంధించి కూడా అన్ని రంగాలలో పాకిస్థాన్‌ను దెబ్బతీయడానికి భారతదేశం అనేక చర్యలు తీసుకుంది. పహ ల్గాం మారణకాండకు సైనికపరంగా ప్రతీకారం తీర్చు కోవడంలో న్యూఢిల్లీ తొందరపడలేదు. సరైన సమయానికి సమర్థవంతమైన నిర్ణయం తీసుకుంది.

 గడీల ఛత్రపతి