calender_icon.png 18 November, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూగజీవాల కేర్ టేకర్

09-03-2025 12:00:00 AM

అతనో హోంగార్డు.. కేవలం తన విధులకే పరిమితం కాలేదు. ఏమాత్రం సమయం దొరికినా మూగజీవాల సేవలో, పర్యావరణ పరిరక్షణలో నిమగ్నమవుతాడు. ఎక్కడైనా పాము కనిపిస్తే నిమిష్లాలో అక్కడ ప్రత్యక్షమై పట్టేస్తాడు. ఇప్పటివరకు 7038 పాములు, 31 మొసళ్లతో పాటు కొండచిలువలు, ఇతర వన్య ప్రాణులను రక్షించి జంతుప్రేమికుడిగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. పర్యావరణ పరిరక్షణ కోసం 276 కి.మీ పాదయాత్ర చేసి ఎంతోమందికి అవగాహన కల్పించాడు. అయితే ఓ హోంగార్డు జంతుప్రేమికుడిలా ఎందుకు మారాడు? మూగజీవాల రక్షణ కోసం ఏం చేస్తున్నాడు? అనే ఆసక్తికర విషయాలు మీకోసం.. 

హోంగార్డుగా పనిచేస్తున్న కృష్ణ సాగర్‌కు అటు పోలీస్ శాఖ, ఇటు ప్రజల్లో మంచి పేరుంది. జంతు ప్రేమికుడు కావడమే అందుకు కారణం. నిత్యం ట్రాఫిక్ విధులను నిర్వహిస్తూనే, మరోవైపు పాములను రక్షిస్తుంటాడు. గతంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్వేతానగర్ తాళ్ల చెరువు పొంగిపొర్లిన సమయంలో ఎంతోమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి శభాష్ అనిపించుకున్నాడు. ఎవరి ఇంట్లోనైనా పాము కనిపిస్తే వెంటనే అక్కడ ప్రత్యక్ష్యమై పామును పట్టుకొని సురక్షితంగా అడవుల్లో వదిలిపెడుతుంటాడు. దీనితోపాటు ఆ ఇంటి యజమానితో మొక్కను నాటించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాడు. 

అలా మొదలైంది..

పదమూడేళ్ల కిందట తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లాడు కృష్ణ సాగర్. అయితే తరచుగా పరిసర ప్రాంతాల్లో పాములు కనబడేవి. అవి ఎక్కడ కాటు వేస్తాయో అనే భయంతో పాములను చంపేవాడు. ఈ క్రమంలో ఓసారి పాముకాటుకు గురయ్యాడు కూడా. అయితే పాములన్నీ విషపూరితంగా ఉంటాయా? అనే సందేహంతో వాటి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ప్రకృతిలో కొన్ని పాములు మాత్రమే విషపూరితమైనవి తెలుసుకున్నాడు.

ఆనాటి నుండే పాములపై ప్రజల్లో అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. కొంతమంది యువకులతో ‘సాగర్ స్నేక్ సొసైటీ’ సంస్థను స్థాపించి వారికి అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చాడు. తాను అందుబాటులో లేని సమయంలో వారంతా పాములను కాపాడే పనిలో ఉంటారు. ఈ క్రమంలో రక్షించిన పాములు, కొండ చిలువలు, మొసళ్లు, జింకలు, గుడ్ల గూబలతో పాటు వివిధ రకాలైన పక్షులను రక్షించాడు. మొసళ్లను జూరాల ప్రాజెక్టులో, కొండ చిలువలు, పాములను శ్రీశైలం ఫారెస్టులో వదిలేస్తున్నాడు. 

పర్యావరణ కోసం పాదయాత్ర 

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇటీవల జోగుళాంబ ఆలయం నుంచి హైదరాబాద్ వరకు 267 కి.మీ మేర పాదయాత్ర చేశారు. అటవీ శాఖ సహకారంతో జాతీయ రహదారిపై వెయ్యి మొక్కలను నాటాడు. పదేండ్ల కాలంలో ఇప్పటి వరకు వేల సంఖ్యలో పాములు, వణ్యప్రాణులను రక్షించాడు. గాయపడినవాటికి చికిత్స సైతం అందించిన సందర్భాలున్నాయి. ఇందుకోసం సొంతంగా ఖర్చుచేయడానికి కూడా వెనుకాడడు. 

పర్యావరణాన్ని ప్రేమించాలి

ప్రక్రృతికి మనం ఏది ఇస్తామో.. అది తిరిగి మనకు వస్తుంది. ఎవరి ఇళ్లలోనైనా వన్యప్రాణులు, పాములు, మూగజీవాలు కనిపిస్తే చంపకుండా స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇవ్వాలి. వాళ్లు సురక్షితంగా పాములను పట్టుకుంటారు. అయితే నేను పాములను పట్టుకున్నందుకుగానూ కుటుంబలో ఎవరో ఒకరిచేత మొక్కలు నాటిస్తున్నా. పర్యావరణ పరిరక్షణ కోసమే ఇలా చేయిస్తుంటా. నా సేవలు మెచ్చి ప్రతిఒక్కరూ సహకరించడం ఆనందంగా ఉంది. 

- పి. రాము, వనపర్తి (విజయక్రాంతి)