calender_icon.png 9 January, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ గ్రీన్‌ల్యాండ్!

08-01-2026 12:00:00 AM

మొన్నటిదాకా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానంటూ బీరాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మనసు మార్చుకున్నారు. శాంతి అంశాన్ని పక్కనబెట్టిన ట్రంప్ ప్రస్తుతం లాటిన్ అమెరికా దేశాలను తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వెనిజులా దేశంపై దండెత్తడంతో పాటు ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో దంపతులను బంధించి న్యూయార్క్‌కు తరలించారు. తాజాగా ట్రంప్ కన్ను గ్రీన్‌లాండ్‌పై పడింది. మరో 20 రోజుల్లో గ్రీన్‌లాండ్ గురించి మాట్లాడుకుందామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి గ్రీన్‌లాండ్ వ్యూహాత్మకంగా కీలకమైందని, అమెరికాలో కలిపేందుకు వీలున్న మార్గాలను పరిశీలించాలని ట్రంప్ తన బృందానికి సూచించారు. అవసరమైతే సైనిక చర్యను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

దీనిపై డెన్మార్క్ ప్రధాని ఫ్రెడెరిక్‌సన్ తీవ్రంగా స్పందించారు. తోటి నాటో దేశంపై అమెరికా దాడిచేస్తే సంబంధాలు ఆగిపోతాయని, ఇది నాటోకు ముగింపేనని హెచ్చరించారు. ఇక గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్నేయడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు మధ్యలో గ్రీన్‌లాండ్ ద్వీపం ఉంటుంది. ఇది అమెరికా సైన్యానికి వ్యూహాత్మక దాడులు చేసేందుకు కీలక ప్రాంతం. 1979లో స్వాతంత్య్రం పొందిన గ్రీన్‌లాండ్ భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నప్పటికీ యూరప్ ఖండాలైన నార్వే, డెన్మార్క్‌ల నియంత్రణలోనే కొనసాగుతోంది. అపారమైన ఖనిజ, చమురు, సహజ వాయువు నిల్వలకు పేరు పొందిన గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికా 1946లోనే ప్రయత్నించింది.

అయితే, డెన్మార్క్ నిరాకరించడంతో అప్పటినుంచి ఈ ద్వీపంపై అమెరికా ఒక కన్నేసి ఉంచింది. అంతేకాదు గ్రాఫైట్, లిథియం లాంటి 25 అరుదైన ఖనిజాల నిక్షేపాలకు గ్రీన్‌లాండ్ ఆలవాలంగా ఉంది. ఈ అరుదైన ఖనిజాల కోసం అమెరికా చాలాకాలంగా చైనాపై ఆధారపడుతూ వస్తోంది. గతంలో చైనాపై భారీ టారిఫ్‌లు విధించినప్పటికీ అంతే వేగంగా దానిని వెనక్కి తీసుకోవడానికి కారణం అరుదైన ఖనిజాలపై చైనా నిషేధం విధించడమే. అందుకే గ్రీన్ లాండ్ తమకు చిక్కితే ఖనిజాల కోసం చైనాను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని ట్రంప్ ఆలోచన. అయితే ట్రంప్ చర్యలను రష్యా, చైనా సహా యూరప్ దేశాలు వ్యతి రేకిస్తున్నాయి.

ఇప్పటికే చమురు నిక్షేపాల పేరుతో వెనిజులాను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ట్రంప్‌కు కేవలం 57 వేల జనాభా కలిగిన గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఆ తర్వాత కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి ద్వీప దేశాలను హస్తగతం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచన మాత్రం దుర్మార్గపు చర్యగా అనిపిస్తున్నది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్‌లో అహంకారం భావం పెరిగిపోయింది. మెక్సికోను తొలి నుంచి ద్వేషిస్తూ వచ్చిన ట్రంప్ గతేడాది రెండోదఫా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ తెచ్చిన ఫైల్‌పైనే తొలి సంతకం చేశారు. డ్రగ్స్ సరఫరా, వలసలను అరికట్టేందుకే ఇదంతా చేస్తున్నట్లు పైకి చెబుతున్నా.. ఈ దేశాలన్నింటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకుంటే ప్రపంచంలోని సహజ సంపదలన్నీ తన కాళ్ల కిందే ఉంటాయని, అప్పుడు ప్రపంచాన్ని శాసించొచ్చు అనే భావనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుగా అనిపిస్తున్నది.