09-01-2026 09:55:38 AM
30 ఏళ్ల తరువాత ఎగిరిన జెండా మూడు తరాలకు స్ఫూర్తి నింపుతాం.
రెండేళ్లలోనే పదేళ్ల అభివృద్ధికి నిధులు.
ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయం.
అసలైన రాజకీయం ఇప్పుడే మొదలు.
స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేందుకు సుదీర్ఘ కాలం పాటు వేచి చూశారని ప్రస్తుతం ఎగురుతున్న ఈ జెండా మూడు తరాల వరకు ఎగురుతూనే ఉండేలా ఆ స్థాయిలో అభివృద్ధిని చేసి చూపుతామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రెండేళ్ళల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రెండేండ్ల కాలంలోనే వెయ్యి కోట్లకు పైగా నిధులు సమకూర్చి వచ్చే పదేళ్ల కాలం వరకు అభివృద్ధిని చవిచూసే విధంగా నిధులు సమకూర్చినట్లు పేర్కొన్నారు. తమపై నమ్మకముంచి ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఈ పదవి ప్రజా శ్రేయస్సు ఈ ప్రాంత అభివృద్ధికి పని చేస్తానాన్నారు.
పట్టణంలోని ఎండబెట్ల వద్ద హై లెవల్ బ్రిడ్జికి 10కోట్లు, సీసీ రోడ్లకు 20కోట్లు, బస్టాండుకు 12కోట్లు, సిర్సవాడ బ్రిడ్జికి 20కోట్లు, యంగ్ ఇండియా పాఠశాలకి 200కోట్లు, అసంపూర్తిగా ఉన్న మార్కండేయ రిజర్వాయర్ కు 25కోట్లు మంజూరు చేయించి ప్రారంభించామన్నారు. విద్యుత్ ఉప కేంద్రాలు, సామాగ్రి స్టోరేజ్ కేంద్రం స్ర్తీశక్తి భవన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్టీఏ కార్యాలయం. ముస్లింల షాదీఖానా కోసం 3కోట్లకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు త్వరలో మంజూరు అవుతాయన్నారు. తెల్కపల్లికి డిగ్రీ కళాశాల మంజూరి ఇలా విద్య వైద్యం రైతాంగ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గత పదేళ్ల కాలంలో చేసింది కొంత అయినా ప్రచార ఆర్భాటాలు చేసి ఎక్కువగా అభివృద్ధి చేసినట్లు హంగామా చేస్తారని సెటైర్ వేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయంగా అడవులు వేస్తామని ఇకనుండి రాజకీయం అంటే ఏంటో రుచి చూపిస్తామని సవాల్ విసిరారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ముఖ్యమంత్రి స్థానం వరకు రేవంత్ రెడ్డి ఎదిగిన తీరును చూసి కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నారని తన ఇంట్లో పుట్టిన బిడ్డ అడుగుతున్న ప్రశ్నలకే జవాబు ఇవ్వలేని స్థితిలో టిఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది అన్నారు. కేవలం మూడేళ్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పుకునే వారికి మళ్లీ వచ్చేది కూడా కాంగ్రెస్సేనని గుర్తుంచుకోవాలన్నారు. వారితోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు ఉన్నారు.