04-10-2025 12:00:00 AM
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ముగింపునకు కీలక అడుగులు పడుతున్నాయి. ఇరువురి మధ్య రెండేళ్ల క్రితం మొదలైన యుద్ధం ఇప్పటికీ రావణకాష్టంలా మండుతూనే ఉంది. అయితే ఇజ్రాయెల్, హ మాస్ యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో రూపొందిన 20 సూత్రాల ప్రణాళిక గాజాలో శాంతి దిశగా ఒక అడుగు ముందుకు పడిందని చెప్పొచ్చు. ఇటీవలే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు హమాస్‌పై కోపంతో గాజా సిటీలో జరుగుతున్న నరమేధంపై ఆందోళన వ్యక్తం చేశా యి.
ఇదీగాక పాలస్తీనాను స్వతంత్ర దేశంగా 150కి పైగా దేశాలు గుర్తించడం వంటి పరిణామాల నేపథ్యంలో ట్రంప్ మరోసారి తన శాంతి ప్ర స్తావనను తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే ట్రంప్ బృందం 20 సూ త్రాల ప్రణాళికతో యుద్ధాన్ని ముగించేలా ఒక ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనకు ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరిపిన ట్రంప్ అతన్ని ఒప్పంచి యుద్ధానికి ముగింపు పలికేలా దారికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఇటీవలే ఖతార్‌లోని దోహాపై దాడి చేసినందుకు గానూ నెతన్యాహు ఖతార్‌కు క్షమాపణ చెప్పడం వెనుక కూడా ట్రంప్ హస్తముందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా ప్రకటించిన 20 సూత్రాల ఫార్ములాలో చాలా అంశాలు పాలస్తీనాకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. గాజా పునర్నిర్మాణానికి ప్ర త్యేక మండలి ఏర్పాటు, రోజుకు 600 ట్రక్కులలో మానవతా సాయాన్ని అందించడం, గాజాలో కీలక మౌలిక వసతుల కల్పన, ఉపాది కల్పనకు తోడ్పాటు అందించడం, గాజా సహా ఇతర ప్రాంతాలను ఇజ్రాయెల్ ఆక్రమించకుండా ఉండటం, బందీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ సైని కుల వైదొలగడం వంటివి ఒప్పందంలో చెప్పుకోదగిన అంశాలు.
అయితే హమాస్ ప్రతినిధులతో సంప్రదించకుండా ఏకపక్షంగా రూపొందించిన 20 సూత్రాల ప్రణాళిక పట్ల హమాస్ సంస్థ ఏ విధంగా స్పం దిస్తుందనే ది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ట్రంప్ ప్రణాళికపై హమాస్ నేతలతో ఖతార్, ఈజిప్టు నేతలు చర్చించారు. తాము మంచి ఆలోచనలతోనే ట్రంప్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని, ఆ తర్వాతే దీనిపై స్పం దిస్తామని హమాస్ పేర్కొంది. గాజా యుద్ధానికి ముగింపు పలకడానికి ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికను భారత ప్రధాని మోదీ స్వాగతించారు. ఇది దీర్ఘ కాల శాంతికి బాటలు పరుస్తుందని అభిప్రాయపడ్డారు.
ట్రంప్ 20 సూ త్రాల ఫార్ములాపై మధ్యవర్తులు ఈజిప్టు, ఖతార్ సహా చైనా, పాకిస్తాన్, ఈజిప్టు, జోర్డాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యూ ఏఈ సైతం మద్దతు పలకడం విశేషం. అయితే 20 సూత్రాల ప్రణాళిక ప్రతిపాదనలు చేస్తూనే.. దీనిపై హమాస్‌కు ట్రంప్ ఎలాంటి కాలపరిమితి గానీ, ఒప్పందాన్ని అంగీకరించేందుకు గడువు కానీ ఇవ్వలేదు. తమ ప్రతిపాదనలపై మూడు, నాలుగు రోజుల్లో ప్రతిస్పందించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.
ఒకవేళ ఒప్పందానికి అంగీకరించకపోతే హమాస్ ముగింపు విషాదంగా ఉంటుందని పేర్కొనడం చూస్తే అసలు హమాస్ సంస్థనే తొలగించేందుకు కుట్ర జరుగుతుందా అన్న అనుమానం రాక మానదు. ట్రంప్ శాంతియత్నాలు ఫలించి హమాస్ ముందు కొచ్చి 20 సూత్రాల ఫార్ములాకు ఒప్పుకుంటుందని ఆశిద్దాం.