calender_icon.png 8 October, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్న పరిచయం.. తమ్ముని అనుబంధం

04-10-2025 12:00:00 AM

ముప్పు ఏళ్ల కిందటి సంగతి. పున్న ఎల్లప్ప గారు మా ఇంటికి వచ్చారు, కొన్ని పత్రికలు చేతిలో పట్టుకొని. వారికి స్వాగతం చెప్పి, ఇంట్లో ఆసీనులైన తర్వాత వారు తెచ్చిన పత్రికల్ని తిరిగేశాను. ‘పద్మశాలి’ పేరుతో నెలనెలా ప్రచురితమయ్యే పత్రికలవి. వాటిలో కేవ లం పద్మశాలీలకు సంబంధించిన వార్తలే గాక, కర్షకులకు, కార్మికులకు, సర్వోదయ భావాలకు సంబంధించిన విషయాలుండడం గమనార్హం. ఎల్లప్ప గారు ‘పద్మశాలి’ పత్రికను నడిపినప్పటికీ దాన్ని కేవలం కు లానికి మాత్రమే పరిమితం చేయలేదు. ఎల్లప్పుడు ఖద్దరు వస్త్రాలు ధరించే ఎల్లప్ప గాంధేయవాది. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం నిజంగా సిరులకు ఘని.

పద్దెనిమిది సంవత్సరాల పాటు సిరిపురం సర్పంగా వున్న ఎల్లప్ప గారు గ్రామానికి సేవలు చేశారు, పేరు గాంచారు. ‘మీరు కవిత్వం రాస్తారు కదా’ మా ప్రతికకు కూడా రాయండి. సమాజంలోని అందరి అభ్యుదయమే మా ప్రుతిక నధ్యేయం’ అని నన్ను కోరారు. పున్న ఎల్ల ప్ప గారికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మధ్య ఎంతో స్నేహం ఉంది. ‘నేను ఎం.ఎల్.ఏ న గా గెలవడానికి చాలాసార్లు ఎంతగానో శ్రమించిన నిజమైన మిత్రుడు, బంధువు పున్న ఎల్లప్ప’ అని ఒక సభలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కొనియాడగా విన్నాను. అందువల్లనే నేను వారిని మా ఇంటికి ఆహ్వానించాను. 

దశరథతో పరిచయం

ఒకసారి మా ఇంటికి వచ్చిన ఎల్లప్పగారిని ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నానంటే దాని కి కారణం వారి సోదరులైన డాక్టర్ పున్న దశరథ గారు. నేను వారాసిగూడ నుంచి బోడుప్పలుకు మకాం మారిన తర్వాత అ దృష్టవశాత్తు డాక్టర్ దశరథ గారితో పరిచయం కలగడానికి వారి అన్న గారైన ఎల్ల ప్పగారే కారణం.  పున్న దశరథ గారు సిరిపురంలో దాదాపు నలభై ఏళ్లు వైద్య వృత్తి లో ఉండి హైదరాబాదుకు ఇల్లు మార్చినా రు. బోడుప్పలు కమానుకు, మా ఇంటికి మధ్య రోడ్డు మీదనే ఉంటుంది వారి ఇల్లు. పున్న దశరథ అనే పేరు చూసి నేనే వారి ఇంటికి వెళ్లాను.

వారిప్పుడు ప్రాక్టీసు చేయకున్నా వైద్య సలహాలివ్వడంలో సమర్థులు. వారి కుమారులు డాక్టర్ మనోరంజన్ ఎంగేజ్‌మెంట్ సందర్భంలో వారితో అనుబంధం మరింత గట్టి పడింది. వారి కోడ లు నా దగ్గర హైస్కూల్‌లో చదివిన ఒక శిష్యునికి మేనకోడలవుతుంది. నా శిష్యు డు డాక్టర్ దశరథ గారికి నా బోధనా సా మర్థ్యాన్ని చెప్పినట్లుంది. తదాదిగా ‘మీరు కవులండి. మీరేం చెప్పినా మేం వినాలి ’ అని అంటుంటారు. కాని వారే నాకు ఎ న్నో విషయాలు చెబుతారు. డాక్టర్ దశరథ గారు సౌజన్యశీలి. అందరితో సఖ్యంగా ఉంటారు. గర్వం చూపరు. ఎన్నో దేవాలయాలకు విరాళాలిచ్చి పునరుద్ధరించిన పే రు వారికి ఉంది. వారచ్చమైన సీనియర్ సిటిజన్. సిటీలో వయో వృద్ధుల సమావేశాలెప్పుడు జరిగినా హాజరవుతారు.

ఒక సారి రవీంద్రభారతి ప్రధాన వేదిక మీద ‘టాస్కా’(తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్) వారి ఆధ్వర్యంలో గొప్ప సభ ఏర్పాటు చేయబడింది. దశరథగారితో నేనూ సభకు వెళ్లాను. వేది క మీద టాస్కా అధ్యక్షుడు పి. నరసింహారావుతో పాటు నన్ను చాలా అభిమానించే పాతూరి సుధాకర్‌రెడ్డి మాజీ ఎం.ఎల్.సి గారున్నారు. వారి ప్రసంగాలను శ్రద్ధతో ఆ లకిస్తున్న సందర్భంలో నా ప్రక్కనే ఉన్న డాక్టర్ దశరథ గారు లేచి నేరుగా సభా వే దిక పైకి వెళ్లి సభాధ్యక్షునికి ఏదో చెప్పి వ చ్చారు. ఐదు నిమిషాల తర్వాత నన్ను వేది క మీదికి ఆహ్వానించారు నిర్వాహకులు. నేను సంతోషంగా వెళ్లి ప్రసంగించాను.

ఆ బాధ్యత డాక్టర్లదే

‘నేటి బాలురే రేపటి పౌరులంటారు గాని నేటి బాలురే రేపటి వృద్ధులు’ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. వృద్ధులను గౌరవిస్తే వృద్ధిలోకి వస్తారు’(వృద్ధిశ్చ వృద్ధిశ్చ) అని రెండు మాట లతోనే నా ప్రసంగాన్ని ముగించాను. నా మాటలకందరూ హర్షించారు. చప్పట్లు కొట్టడం వల్ల నాకు సంతోషమైంది.

సభానంతరం డాక్టర్ దశరథగారి చొరవను అభినందించకుండా ఉండలేకపోయాను. తదాదిగా టాస్కా వారు ప్రతి సభా కార్యక్రమంలో నన్ను పిలవడంతో పాటు, నా వ్యాసాలను ‘పిలుపు’ పత్రికలో అచ్చువేయడం క్రమంగా కొనసాగుతుంది. ‘అప్పి చ్చువాడు, వైద్యుడు’ తప్పక ఊరిలో ఉం డాలంటారు. డాక్టర్ దశరథ గారు వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేయకున్నా కాలనీలో ఎందరికో ఆపద్భాంధవుడిగా మెలగడం వారి గొప్పతనం.

అమెరికా నుంచి వచ్చిన మా అమ్మాయి, అల్లుడూ ఇద్దరూ జెట్‌లాక్ కారణంగా వచ్చిన రోజే అనారోగ్యం పాలయ్యారు. అర్ధరాత్రి ఇంటికి దశరథ గారు వచ్చి, సెలెన్ ఎక్కించి, స్వస్థులను చేసిన ఆ సంఘటనను నేనెన్నడూ మరవలేను. 60 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు అనేక ఆరోగ్య సమస్యలేర్పడుతుంటాయి. వారికి మంచి సలహాలిచ్చి, మందులు సూచించి ఆరోగ్యవంతులను చేసే బాధ్యత సీనియర్ డాక్టర్లదే అనిపిస్తుంది. మాకెలాంటి ఆరోగ్య సమస్యలున్నా నేను నా కుటుంబం డాక్టర్ దశరథ గారినే మొదట సంప్రదించి ఆ తర్వాత ఇంకో పెద్ద ఆస్పత్రికి వెళ్లే ప్రయత్నం చేస్తాం.

లోక కళ్యాణం కోసం

ఊరికో డాక్టరు, వాడకో స్కూలు ఉండవలసిన కాలమిది. అటు డాక్టరుకు గాని, ఇటు అధ్యాపకునికి గాని సహనమే భూషణం. డాక్టరుకు కోపం వస్తే ఆరోగ్యం చెడుతుంది. అధ్యాపకునికి కోపం వస్తే విద్య రాకుండా పోతుంది. అందుకే మన పూర్వీకులు విద్యా, వైద్య రంగాలకెంతో ప్రాధాన్యమిచ్చారు. ఈ రెండింటి విషయంలోనే ఎన్ని ప్రభుత్వాలైనా మంచి పేరు తెచ్చుకోవడానికి లేదా చెడ్డపేరు తెచ్చుకోవడానికి అవకాశముంది. ఫీజు చెల్లిస్తేనే డాక్టర్లు వైద్యం చేస్తారు.

ఫీజులిస్తేనే అధ్యాపకులు చదువు చెబుతారు. లోక కళ్యాణం దృష్ట్యా ఇద్దరూ సమాజసేవలో భాగస్వాములు కావాలనకున్నప్పుడు ఫీజు ల మీది దృష్టి కంటె సేవాదృష్టి గొప్పదని భావించక తప్పదు. అప్పుడే వీరు చరితార్థులవుతారు. నా వరకు నేను నలభై ఏళ్లు అధ్యాపక వృత్తిలో ఉండి వేలాది మంది విద్యార్థులకు విద్యనందించారు. అదేమి చిత్రమో డాక్టర్ దశరథగారు కూడా 40 ఏళ్లు వైద్య వృత్తిలో రాణించారు. డాక్టర్ దశరథ గారికి కొత్తగా పరిచయమైన రోజుల్లో ఒక సంఘటన జరిగింది.

ఒకరో జు నేను హనుమకొండకు వెళ్లి, చందనా గార్డెన్స్‌లో ‘బృహదారణ్య కోపనిషత్తు’ మీద ప్రసంగించి బోడుప్పల్ బస్ స్టాం డుకు వచ్చేసరికి రాత్రి 12 గంటలైంది. భారీ వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. నేను బస్ స్టాండులో తడిసి ముద్దయ్యాను. ఇంటికి ఎట్లా రావాలో తెలియని పరిస్థితి. బహుశా మా ఇంట్లో నేను మర్నాడు వస్తాడని అనుకొని ఉంటా రు. వారినా సమయంలో నిద్ర లేపడం బాగనిపించలేదు. విచికిత్సలో పడ్డాను. బస్‌స్టాండుకు మా ఇల్లు రెండు కిలో మీటర్లుతై, డాక్టర్ గారిల్లు ఒకే కిలోమీటర్. నేను ఏమన్నా కానీ అని డాక్టర్ గారికి ఫోనుచేసి నా పరిస్థితి వివరించాను.

డాక్టర్లు రాత్రి పూట కూడా మేల్కొని ఉంటారు కదా! ‘మీరేమీ భయపడకండి. మా బాబు మనోరంజన్ మీ దగ్గరకి వస్తాడు’ అని ఫోన్లో భరోసానిచ్చాడు. అనుకున్నట్లే పది నిముషాల్లో మనో రంజన్ స్కూటర్ మీద వచ్చి, మరో పదిహేను నిముషాల్లో మా ఇంటికి చేర్చాడు నన్ను. ఆయనా, నేనూ వర్షంలో బాగా తడిసిపోయాం. మనోరంజన్ ‘సార్ నేను వస్తాను జాగ్రత్త’ అని చెప్పి వెళ్లిపోయాడు.  ఈ సంఘటన నేను ఎన్నటికీ మరువలేనిది.

వ్యాసకర్త సెల్: 98856 54381