06-12-2024 01:07:12 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 5 (విజయక్రాంతి): భారత సంస్కృతిలో మహిళా శక్తి ఎంతో గొప్పదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నగరంలోని మాదా పూర్‌లోని శిల్పారామం సమీపంలో గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఇందిర మహిళా శక్తి బజార్‌ను ప్రారంభించి మాట్లాడారు.
మహిళా సహాయక సంఘాలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడం అభినందనీయమన్నారు. ఇప్పటివరకు 65 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీలు) ద్వారా రుణాలు పొందారన్నారు. వారి కుటుంబాల అభివృద్ధికి సర్కార్ చేయూతనివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు మహాశక్తిగా ఎదిగేందుకు రూ. 500 కోట్ల విలువైన ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ప్రారంభిస్తున్నామన్నారు.
మహిళలను కోటీశ్వరులు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. మహిళలను సోలార్ పవర్ ప్లాంట్లలోనూ భాగస్వాములను చేస్తామని వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి బజార్‌ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకులు బజార్‌ను తిలకిస్తారన్నారు.
మహిళలు ఏ రంగంలోనైనా నైపుణ్యం చూపిస్తే అందుకు అనుగుణంగా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కార్యక్రమంలో గవర్నర్ సతీమణి దీపాదేవ్ వర్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సెర్ఫ్ సీఈవో దివ్య, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.