06-09-2025 01:16:25 AM
హైదరాబాద్ పోలీసులకు నయా జోష్
అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో మహిళా అశ్విక దళం ఏర్పాటు
హైదరాబాద్, సిటీబ్యూరో సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర పోలీసింగ్ వ్యవస్థలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ దేశంలోనే తొలిసారిగా మహిళా అశ్విక దళాన్ని ప్రవేశపెట్టారు. ఇదే సమయంలో నేర పరిశోధనలో కీలకమైన డాగ్ స్క్వాడ్‌ను భారీగా విస్తరిస్తున్నారు. గోషామహల్ నుంచి అశ్విక దళం, డాగ్ కెనల్స్‌ను అధునాతన వసతులతో కొత్త ప్రాంగణానికి తరలించనున్నారు.
మరోవైపు, శనివారం గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశామని, డీజేలకు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పష్టంచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక తతోపాటు మానవ వనరులకు పదును పెడుతున్న నగర పోలీసులు, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే లక్ష్యంతో పది మంది మహిళా కానిస్టేబుళ్లతో ప్రత్యేక అశ్విక దళాన్ని ఏర్పాటుచేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు.
చరిత్రలో తొలిసారి మహిళా అశ్విక దళం
పది మంది సాయుధ రిజర్వ్ మహిళా కానిస్టేబుళ్లు గోషామహల్ మౌంటెడ్ యూనిట్‌లో రెండు నెలలపాటు కఠిన శిక్షణ పూర్తి చేసుకుని అశ్విక దళంలో భాగమయ్యారు. ఇకపై వీరు బందోబస్తు, వీఐపీల భద్రత, పెట్రోలింగ్ వంటి కీలక విధుల్లో పాల్గొంటారు. దేశంలోనే ఇదొక కీలకమైన ముందడుగు. మహిళా మౌంటెడ్ పోలీసులు గస్తీలో పాల్గొనడం ఇదే మొదటిసారి అని కమిషనర్ హర్షం వ్యక్తంచేశారు.
నేర పరిశోధనలో పోలీసులకు చేదోడు వాదోడుగా ఉండే డాగ్ స్క్వాడ్‌ను మరింత పటిష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 34 శునకాలపై పనిభారం అధికంగా ఉన్నందున, వాటి సంఖ్యను 54కు పెంచాలని నిర్ణయించారు. బాంబులు, మాదకద్రవ్యాలు, నేరస్తు ల గుర్తింపు వంటి అంశాల్లో ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో వీటికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ బ్రీడర్ల నుంచి నాణ్యమైన శునకాలను ఎంపిక చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పటికే మొదటి దశలో 12 శునకాలను సేకరించామని కమిషనర్ తెలిపారు. నూతన ఉస్మా నియా జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ, గోషామహల్ పోలీ స్ స్టేడియం ఆవరణలోని గుర్రపు మైదానం, అశ్విశాల, డాగ్ కెనల్స్‌ను కొత్త ప్రదేశానికి తరలించనున్నారు.
ఇందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కమిషనర్ వెల్లడించారు. 11.5 ఎకరాల విస్తీర్ణంలో 60 శునకాల కోసం డాగ్ కెనల్స్, మౌంటెడ్ యూనిట్, సిటీ సెక్యూరిటీ వింగ్ భవనాలు, స్వాధీనం చేసుకున్న వాహనాల పార్కింగ్, పెరేడ్ గ్రౌండ్ వంటి అధునాతన వసతులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లు ఈ నెల 8న పూర్తవుతాయని తెలిపారు.
నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు
గణేష్ నిమజ్జన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. నిమజ్జనం సుమా రు 40 గంటలపాటు కొనసాగే అవకాశం ఉంది. కేవలం ట్యాంక్ బండ్ వద్దే 50 వేల విగ్రహాల నిమజ్జనం జరగనుంది. మొత్తం 29 వేల మంది పోలీసులు షిఫ్టులవారీగా విధుల్లో ఉంటారు. నిమజ్జన మార్గాలను పర్యవేక్షించేందుకు ప్రస్తుత సీసీ కెమెరాలతోపాటు అదనంగా 250 కెమెరాలు, 6 డ్రోన్లను వినియోగిస్తున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1:30 గంటలలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రక్షిత కృష్ణ మూర్తి, డీసీపీ చంద్రమోహన్, ధార కవిత, డీసీపీ గిరి రాజు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.