24-11-2025 07:51:02 PM
హనుమకొండ,(విజయక్రాంతి): కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సంక్షేమ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హన్మకొండ కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో హనుమకొండ ఉప కార్మిక కమిషనర్ వినీతతో కలిసి స్నేహ శబరీష్ కార్మిక సంక్షేమ పథకాలపై అవగాహణ సదస్సుల్లో భాగంగా పోస్టర్ విడుదల చేశారు. అనంతరం స్నేహ శబరిష్ మాట్లాడుతూ... కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ విధానాల్లో చాలా మార్పులు జరిగాయని, తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలిలో నమోదు చేసుకున్న కార్మికులకు కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ విధానంతో చేకూరే పాలసీ లబ్దివివరాలను వివరించారు.
ఇందులో భాగంగా సహజ మరణం భీమా 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పెంపు, ప్రమాదవశత్తు మరణం భీమా 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు, అదేవిధంగా ప్రమాదవశాత్తు పూర్తి శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం, ప్రమాదవశాత్తు పాక్షిక శాశ్వత అంగ వైకల్యము కలిగిన వారికి రూ.4 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందజేయబడుతుంది. అన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఉప కార్మిక కమిషనర్ ఏ ఎస్.వినీత, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు రజిత, వినోద్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ కె. ప్రసాద్, ఆనంద్,సుధీర్ తదితరులు పాల్గొన్నారు.