09-10-2025 12:23:59 AM
-హెడ్ , కమ్మిన్స్‌కు ఐపీఎల్ ఫ్రాంజైజీ ఆఫర్
-తిరస్కరించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు
సిడ్నీ , అక్టోబర్ 8: ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు ఒక వార్త కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు ట్రావిస్ హెడ్ , ప్యాట్ కమ్మిన్స్ కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ డీల్ ఆఫర్ చేసిందట. రూ.58 కోట్లు ఇస్తామని, ఆస్ట్రేలియా క్రికెట్ తో తెగతెంపులు చేసుకోవాలని కోరిందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా తమ ఫ్రాంచైజీ తరపున అన్ని టీ ట్వంటీ లీగ్స్ లో ఆడేందుకు వీలుగా ఒప్పందం చేసుకోవాలని అడిగినట్టు తెలుస్తోంది. హెడ్ , కమ్మిన్స్ ఇద్దరికీ ఏడాదికి 10 మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్టు ఆస్ట్రేలియా మీడియా కథనం ప్రచురించింది.
జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ఇచ్చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని లీగ్స్ లో ఆడొచ్చు. అయితే ఈ ఆఫర్ ఇచ్చిన ఐపీఎల్ ఫ్రాంచైజీ పేరు మాత్రం తెలియలేదు. ఐపీఎల్ లో వీరిద్దరూ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ రు వీరిద్దరూ తిరస్కరించినట్టు తెలిసింది. జాతీయ జట్టుకు ఆడడమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పినట్టు సమాచారం. నిజానికి జాతీయ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ , ఇతర ఒప్పందాలు, ఐపీఎల్ ద్వారా కమ్మిన్స్ రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకూ ఆర్జిస్తున్నాడు.
అటు హెడ్ కూడా దాదాపు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ అందుకుంటున్నాడు. అటు ఫ్రాంచైజీ ఇంత భారీ మొత్తం ఆఫర్ చేయడం వెనుక పెద్ద లాభమే ఉంది. ఏడాది పొడవునా చాలా లీగ్స్ జరుగుతూనే ఉంటున్నాయి. ఐపీఎల్ లో ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా, దుబాయి, వెస్టిండీస్ , ఇంగ్లాండ్ దేశాల్లో ఉన్న లీగ్స్ లో వాటాలను కలిగి ఉన్నాయి. దీంతో స్టార్ ప్లేయర్స్ ను ప్రతీ లీగ్ లో బరిలోకి దింపితే ఆ ఫ్రాంచైజీ పాపులారిటీ కూడా బాగానే పెరుగుతుంది.